విశాఖ : ఏవోబీలో మావోల హల్‌చల్

ABN , First Publish Date - 2020-10-27T15:28:55+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని కాపాడుకునేందుకు రెండ్రోజులకోసారి..

విశాఖ : ఏవోబీలో మావోల హల్‌చల్

విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని కాపాడుకునేందుకు రెండ్రోజులకోసారి మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో హడావుడి చేసిన మావోలు ఇప్పుడు విశాఖలో హల్‌చల్ చేస్తున్నారు. మంగళవారం నాడు విశాఖ ఏవోబీలో మావోయిస్టులు రెండు వాహనాలను దగ్ధం చేశారు. ఒడిశా మల్కన్‌గిరి జిల్లా పప్పర్లమెట్ట అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో పోలీసు బలగాలు, ప్రత్యేక బృందాలు అప్రమత్తమయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ తరుణంలో పోలీసు ఉన్నతాధికారులు మరింత నిఘా పెంచారు.  వీరి కోసం గాలింపు చర్యలను మరింత ఉధృతం చేశారు. అటు ఒడిశా పోలీసు బలగాలు కూడా గాలింపు ముమ్మరం చేయనున్నారని తెలుస్తోంది.


అప్పట్నుంచి..!

కాగా.. జులై నెలలో ఆంధ-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) లో గత 10 రోజుల్లో మూడు ఎన్‌కౌంటర్‌‌లు జరిగాయి. అప్పుడు జరిగిన వరుస ఘటనల్లో  మావోయిస్టు అగ్ర నేతలు మళ్లీ తప్పించుకున్నారని పోలీసులు అంటున్నారు. ఒడిశా సరిహద్దులో అప్పట్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోల అగ్రనేతలు తప్పించుకున్నారని ప్రచారం జరిగింది. అయితే నాటి నుంచి మావోల జాడ పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఈ మధ్య ఇలా వాహనాలు, ఇన్‌ఫార్మర్‌లను కాల్చేస్తూ ఉనికిని చాటుకుంటూ వస్తున్నారు.

Updated Date - 2020-10-27T15:28:55+05:30 IST