లారీ ఢీకొని ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2020-12-11T06:12:53+05:30 IST

జలగలమదుం జంక్షన్‌ వద్ద గురువారం సాయంత్రం లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఇంజనీరింగ్‌ చదువుతున్న ఒక విద్యార్థి మృతిచెందగా, మరో విద్యార్థి గాయపడ్డాడు.

లారీ ఢీకొని ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి
మృతుడు రాజశేఖర్‌ (ఫైల్‌ఫొటో)

సొంతూరు మాడుగుల మండలం ముకుందపురం


అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 10: జలగలమదుం జంక్షన్‌ వద్ద గురువారం సాయంత్రం లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఇంజనీరింగ్‌ చదువుతున్న ఒక విద్యార్థి మృతిచెందగా, మరో విద్యార్థి గాయపడ్డాడు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఎ.స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం... మాడుగుల మండలం ముకుందపురం గ్రామానికి చెందిన టి.రాజశేఖర్‌(21) డైట్‌ కళాశాలలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం సాయంత్రం తరగతులు ముగిసిన తరువాత చోడ వరానికి చెందిన సహచర విద్యార్థి పల్లా జనార్దన్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. జలగలమదుం జంక్షన్‌ దాటిన తరువాత వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. బైక్‌పై వెనుక కూర్చున్న రాజశేఖర్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ నడుపుతున్న జనార్దన్‌ బలమైన గాయమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


సరియా జలపాతంలో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

అనంతగిరి: మండలంలోని జీనబాడు పంచాయతీ పరిధి సరియా జలపాతంలోపడి గురువారం సాయంత్రం ఒక విద్యార్థి మృతిచెందాడు. కె.కోటపాడు మండలం కొరువాడ గ్రామానికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి చీపురుపల్లి అనిల్‌కుమార్‌(22), అతని స్నేహితులు కలిసి సరియా జలపాతాన్ని సందర్శించడానికి వెళ్లారు. అక్కడ ఊబిలో చిక్కుకుపోయి మృత్యువాత పడ్డాడు. స్థానికుల సహకారంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమర్టం నిమిత్తం చోడవరం సీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సుధాకరరావు తెలిపారు. 


రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి

అనకాపల్లి టౌన్‌: జాతీయ రహదారిలోని ఆర్టీవో కార్యాలయ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేఎన్‌ఆర్‌ పేటకు చెందిన కనుమురెడ్డి రాజులమ్మ (74) మృతి చెందినట్టు రూరల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ కేడీఎన్‌ కే రాజు తెలిపారు. రాజులమ్మ టీ తాగడానికి రోడ్డు దాటుతుండగా విశాఖ నుంచి అనకాపల్లి వైపు వస్తున్న వాహనం ఢీకొందని, తీవ్రంగా గాయపడ్డ ఆమెను వైద్యాలయానికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందిందని చెప్పారు. మృతిరాలు సోదరి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్‌సీ తెలిపారు. 


మనోవేదనతో యువకుడు ఆత్మహత్య

అనకాపల్లి టౌన్‌: ఆరోగ్య సమస్యతో మనస్తాపం చెందిన ఒక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ ఎస్‌ఐ ఎస్‌.స్వీటీ అందించిన వివరాల మేరకు... పట్టణంలోని విజయరామరాజుపేటకు చెందిన గొర్ల వాసు సాయికృష్ణ(21) నిమ్ము సమస్య వుంది. దీనికితోడు ముఖంపై మచ్చలు ఏర్పడ్డాయి. వీటివల్ల కొద్దిరోజులుగా మనోవేదన చెందుతున్నాడు. బుధవారం రాత్రి ఇంటి మేడపైన గదిలో శ్లాబ్‌ హుక్కుకి చీరతో ఉరివేసుకున్నాడు. ఫోన్‌ చేసినా ఎత్తకపోవడంతో తండ్రి వెంకటరావు మేడపైకి వెళ్లి చూడగా ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందకు దించి... చికిత్స నిమిత్తం ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. వెంకటరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 


870 కిలోల గంజాయి స్వాధీనం

పాడేరు రూరల్‌: ఏజెన్సీ నుంచి భువనేశ్వర్‌ ప్రాంతానికి లారీలో తరలిస్తున్న 870 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ని అరెస్టు చేసినట్టు పాడేరు ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ తెలిపారు. జి.మాడుగుల ప్రాంతం నుంచి లారీలో గంజాయిని తరలిస్తున్నట్టు ముందుగా అందిన సమాచారం మేరకు బుధవారం మధ్యాహ్నం పాడేరు మెయిన్‌ రోడ్డులో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. జి.మాడుగుల వైపు నుంచి విశాఖపట్నం రోడ్డులోకి వచ్చిన లారీని (ఏపీ 37 టీడీ 6839) తనిఖీ చేశారు. లారీ లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. తూకం వేసి 870 కిలోలు వున్నట్టు గుర్తించారు. బిహార్‌కు చెందిన లారీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని, లారీని సీజ్‌ చేశారు.


Updated Date - 2020-12-11T06:12:53+05:30 IST