-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Lockdown extension until the end of this month
-
యథాతథం!
ABN , First Publish Date - 2020-05-18T09:03:57+05:30 IST
కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈనెలాఖరు వరకు పొడిగించినట్టు కలెక్టర్ వి.వినయ్‌చంద్ తెలిపారు.

ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగింపు
సడలింపులపై ఇంకా స్పష్టతరాని వైనం
కంటెయిన్‌మెంట్ జోన్‌లలో నిబంధనలు కొనసాగింపు
విద్యా సంస్థలు, కోచింగ్ కేంద్రాలు తెరవకూడదు
మాల్స్, సినిమా థియేటర్లు, ప్రార్థనా మందిరాలదీ అదే పరిస్థితి
ప్రయాణికుల విమానాలకు అనుమతి లేదు
హోటళ్లు, రెస్టారెంట్లలో కౌంటర్ సేవలు బంద్
ఆహార పదార్థాల ఆన్‌లైన్ బుకింగ్, డోర్ డెలివరీలకు గ్రీన్ సిగ్నల్
రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడుగంటల వరకు కర్ఫ్యూ
రెడ్, బఫర్, ఆరెంజ్ జోన్లపై త్వరలో సమీక్ష
ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్
విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈనెలాఖరు వరకు పొడిగించినట్టు కలెక్టర్ వి.వినయ్‌చంద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకటి రెండు అంశాల్లో మినహా మూడో విడత లాక్ డౌన్ సమయంలో అమలుచేసిన నిబంధనలు నాలుగో విడత లాక్ డౌన్‌లోనూ కొనసాగి సూచనలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్ అమలులో కొన్నింటికి మినహాంపులు ఉంటాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. అయితే ఏ రంగాలకు సడలింపులు ఇచ్చారు? ఏ రంగాలకు ఇవ్వలేదు అన్నదానిపై సోమవారం స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
కొవిడ్-19ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 23న లాక్‌డౌన్ ప్రకటించింది. ఇప్పటికి రెండుసార్లు పొడిగించగా, తాజాగా ఈనెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు ఆదివారం రాత్రి ప్రకటించింది. వాస్తవంగా ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు కరోనా వైరస్ తగ్గుముఖం పట్టదని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతుండడంతో ప్రజారవాణా, సాధారణ వ్యాపారాలకు కొంతవెసులబాటు ఉంటుందని అంతా ఆశించారు. కానీ రాష్ట్రంలో, జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో రెడ్ జోన్లలో ఎటువంటి సడలింపులు వుండవని, గతంలో ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా వున్న ప్రాంతాల్లో ఇటీవల పాజిటివ్ కేసులు రావడంతో ఆయా ప్రాంతాలను కూడా రెడ్ జోన్లో చేర్చే అవకాశం వుంది.
దీంతో మూడో విడతతో పోల్చుకుంటే నగరంలో, గ్రామీణ ప్రాంతంలో రెడ్ జోన్ పరిధి పెరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అయితే కేంద్రం విడుదల చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి స్థానిక అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేసి జిల్లాలకు పంపాలి. జిల్లాస్థాయిలో యంత్రాంగం కేసుల తీవ్రత, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. కేంద్రం ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి ఉత్తర్వులు విడుదల చేయలేదు. బహుశా సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉంది. ఆ తరువాతే జిల్లాల్లో లాక్‌డౌన్ నిబధనల్లో మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రజారవాణాలో వెసులబాటు ఉంటుందని అందరు ఎదురుచూశారు. అంతర్ జిల్లా, జిల్లాల్లో ముఖ్యప్రాంతాలకు బస్సులు నడిపే విషయమై రాష్ట్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కాగా జిల్లాలో కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించింది. ఏప్రిల్ నెలాఖరుకు పాజిటివ్ కేసులు 23 మాత్రమే వుండగా, ఆ తరువాత కరోనా వైరస్ కోరలు చాచింది. మధ్యలో రెండు మూడు రోజులు మినహా ఈ నెలలో ఇప్పటి వరకు ప్రతి రోజూ కేసులు నమోదు అవుతూనే వునానయి. ఆదివారంనాటికి వాటి 75కు చేరాయి. అంటే 17 రోజుల్లో 200 శాతానికిపైగా పెరిగాయి. నగరంలో అక్కయ్యపాలెం, అల్లిపురం, గాజువాక, శాంతినగర్, రైల్వే న్యూకాలనీ, పూర్ణామార్కెట్, వన్‌టౌన్, దండుబజార్, చందకవీధి, పిఠాపురంకాలనీ, గోపాలపట్నం, వన్‌టౌన్, మాధవధార, మర్రిపాలెంలో కేసులు నమోదయ్యాయి. దీంతో నగరం యావత్తూ రెడ్‌జోన్‌లో కొనసాగుత్నుది. గ్రీన్‌జోన్, ఆరెంజ్ జోన్‌లో పొందుపరిచిన అంశాలు రెడ్‌జోన్‌లో వర్తించవు. అందువల్ల లాక్‌డౌన్‌లో సడలింపులు నగరంలో అమలు అయ్యే పరిస్థితి లేదు. ఇక గ్రామీణ జిల్లాలో నర్సీపట్నం, కశింకోటలో మరల కొత్త కేసులు రావడం, చీడికాడ, బుచ్చెయ్యపేట మండలాల్లో మూడు పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయా ప్రాంతాలు కూడా గ్రీన్ జోన్ నుంచి రెడ్‌జోన్‌లోకి మారనున్నాయి. అయితే జిల్లాలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లపై జిల్లా యంత్రాంగం సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో బఫర్, రెడ్, ఆరెంజ్ జోన్‌ల సరిహద్దులను జిల్లా యంత్రాంగం ఖారారు చేయాల్సి వుంది.
సడలింపులు లేనవి....
- దేశీయ, విదేశీ విమాన ప్రయాణాలు. అయితే వైద్యసేవలు, మెడికల్ ఎయిర్ అంబులెన్స్‌లకు మాత్రం మినహాయింపు ఉంది.
- అన్ని రకాల విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరవకూడదు.
- హోటళ్లు, రెస్టారెంట్లలో కౌంటర్ సేవలకు అనుమతిలేదు.
- సినిమా థియేటర్లు, మాల్స్, వినోద ప్రాంతాలు తెరిచేందుకు అనుమతి లేదు.
- ఆలయాలు, చర్చిలు మసీదు, గురుద్వారల్లో భక్తులకు ప్రవేశం లేదు.
- రాత్రి ఏడుగంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
సడలింపులు
- రాష్ట్రాలమధ్య సమన్వయం మేరకు అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహన ప్రయాణాలకు అనుమతి.
- వైద్య, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, క్వారంటైన్‌లో ఉన్న పర్యాటకులకు హోటళ్లు, రెస్టారెంట్లు సేవలు అందించవచ్చు.
- ఆన్‌లైన్ ద్వారా ఆహార పదార్థాలను హోమ్ డెలివరీ చేసే రెస్టారెంట్లు, కిచెన్లు తెరుచుకోవచ్చు. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అమలు చేస్తారు. (కంటెయిన్‌మైంట్ జోన్‌లకు ఈ వెసులులబాటు వర్తిస్తుందా? లేదా? అనేది కలెక్టర్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.)
- వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు నిబంధనల మేరకు అనుమతిస్తారు. సరకు రవాణ, ఖాళీ ట్రక్కులు నడవడానికి ఎటువంటి ఇబ్బందులు వుండవు.