కిడ్నీ రోగులకు ఊరట!

ABN , First Publish Date - 2020-04-06T10:16:13+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలు చోట్ల డయాలసిస్‌ సెంటర్లు..

కిడ్నీ రోగులకు ఊరట!

ఎక్కడి వారికైనా కేజీహెచ్‌లో ఉచిత డయాలసిస్‌ సేవలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో చర్యలు

ముందుగా అపాయింట్‌మెంట్‌ తీసుకుని సేవలు పొందవచ్చు

ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అర్జున్‌


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలు చోట్ల డయాలసిస్‌ సెంటర్లు మూతపడడంతో కిడ్నీ వ్యాధిగ్రస్థులు ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేజీహెచ్‌ నెఫ్రాలజీ విభాగంలో నెఫ్రో ప్లస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాలసిస్‌ కేంద్రంలో రోగులకు ఉచితంగా డయాలసిస్‌ సేవలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు వేర్వేరు చోట్ల డయాలసిస్‌ చేయించుకుంటూ, లాక్‌డౌన్‌ వల్ల సేవలు పొందలేకపోతున్నవారు ఈ సెంటర్‌లో సేవలు పొందవచ్చని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అర్జున్‌ తెలిపారు. ముందుగా డయాలసిస్‌ చేయించుకునే రోగి బంధువులు వచ్చి అపాయింట్‌మెంట్‌ తీసుకుని, ఇచ్చిన తేదీల్లో రోగిని తీసుకువచ్చి డయాలసిస్‌ సేవలు పొందవచ్చని ఆయన చెప్పారు.


కేజీహెచ్‌తో పాటు విమ్స్‌లో డయాలసిస్‌ సేవలు పొందిన వాళ్లందరూ ప్రస్తుతం ఇక్కడ సేవలు పొందుతున్నారు. విమ్స్‌ను కరోనా వైరస్‌ అనుమానిత వ్యక్తుల కోసం క్వారంటైన్‌/ఐసోలేషన్‌ సెంటర్‌గా మార్చడంతో అక్కడ వైద్యం చేయించుకుంటున్న రోగులు కేజీహెచ్‌లో ప్రస్తుతం డయాలసిస్‌ సేవలు పొందుతున్నారు. వీరితోపాటు ఇతర చోట్ల డయాలసిస్‌ సేవలు పొందినవారు ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కేజీహెచ్‌కి రావచ్చని ఆయన వెల్లడించారు. కేజీహెచ్‌ నెఫ్రోప్లస్‌లో 20 డయాలసిస్‌ మెషిన్లతో సేవలు అందిస్తున్నారు. షిఫ్ట్‌కు 20 మంది చొప్పున ప్రతి రోజూ 60 మంది రోగులకు డయాలసిస్‌ చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో డయాలసిస్‌ చేయించుకోవడానికి ఇబ్బందులు పడే రోగులు కేజీహెచ్‌లో అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూపరింటెండెంట్‌ అర్జున్‌ కోరారు. 

Updated Date - 2020-04-06T10:16:13+05:30 IST