అత్యవసరాల కేంద్రంగా కలెక్టరేట్
ABN , First Publish Date - 2020-04-05T09:38:14+05:30 IST
లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో అత్యవసర సేవల కోసం కలెక్టర్ కార్యాలయాన్ని వినియోగించాలని అధికారులు నిర్ణయించారు.
థర్మల్ స్ర్కీనింగ్ సెంటర్ ఏర్పాటు
అంబులెన్స్‌లు సిద్ధం
విధుల్లోకి ప్రజారవాణా సంస్థ డ్రైవర్లు
వాహనాలకు తక్షణ అనుమతికి ప్రత్యేక సెల్
విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి):లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో అత్యవసర సేవల కోసం కలెక్టర్ కార్యాలయాన్ని వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక విభాగాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. నిరంతరం సేవలు అందించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్‌తోపాటు మరికొన్ని విభాగాలు నెలకొల్పారు. నిత్యావసర సరుకులు, కరోనా వైరస్ అనుమానితులు, ఇతరత్రా సమస్యల కోసం జిల్లా నలుమూలల నుంచి నిత్యం 1092కు వందల సంఖ్యలో ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ఈ నంబర్‌కు వచ్చిన కాల్స్ ఆధారంగా మరికొన్ని విభాగాలు ఏర్పాటు చేశారు. నిత్యావసర సరుకుల కోసం జాయింట్ కలెక్టర్ శివశంకర్ పేషీ, వాహనాలకు అనుమతులు, ఇతరత్రా పాసుల కోసం జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్ది పేషీలో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. జాతీయ సమాచార కేంద్రం, దానికి ఆనుకుని మరో సెంటర్‌లో పలు విభాగాల అధికారులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు.
నిత్యావసర సరుకుల రవాణా, అత్యవసరంగా వాహనాలకు అనుమతి మంజూరు కోసం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంతో ఒక సెల్ పనిచేస్తోంది. ఆస్పత్రులకు అవసరమైన మాస్క్‌లు, శానిటైజర్లు, ఇతర వైద్యసామగ్రి సేకరించేందుకు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విశ్వేశ్వరరావు నేతృత్వంలో ఒక విభాగం పనిచేస్తోంది. కాగా జిల్లాలో జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారికోసం, కరోనా బాధితులన్న అనుమానం ఉన్న వ్యక్తులను ఛాతి ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. ప్రజారవాణ విభాగం డ్రైవర్లకు అంబులెన్స్‌ల బాధ్యత అప్పగించారు. ఫోన్‌ల ఆధారంగా రవాణా శాఖ అఽధికారులు అంబులెన్స్‌లను పంపిస్తున్నారు. కాగా వాహన అనుమతులు, ఇతరత్రా అనుమతుల పాసులకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ఇంకా ఉదయం నుంచి రాత్రి జరిగే సమావేశాలకు వచ్చే అధికారులు, సిబ్బందితో కలెక్టరేట్ హడావుడిగా కనిపిస్తోంది. కలెక్టర్ వినయ్‌చంద్ అప్రమత్తమై కలెక్టరేట్‌కు వచ్చేవారిని థర్మల్ స్ర్కీనింగ్ చేయాలని ఆదేశించారు. దీంతో శనివారం ఉదయం కలెక్టరేట్ పోర్టు దగ్గరి మెట్ల వద్ద ప్రతి ఒక్కరినీ థర్మల్ స్ర్కీనింగ్ చేసి లోనికి అనుమతిస్తున్నారు. మాస్క్‌లు ధరించి రావాలని భద్రతా సిబ్బంది సూచిస్తున్నారు.