అంతా గప్‌చుప్‌!

ABN , First Publish Date - 2020-03-16T06:37:29+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీలకు వారం రోజుల్లో ఎన్నికలు జరగాలి. పంచాయతీల తొలిదశ ఎన్నికలకు ఆదివారం నోటిఫికేషన్‌ వెలువడాలి

అంతా గప్‌చుప్‌!

ఆరు వారాలు నిశ్శబ్దం

కరోనా ప్రభావంతో స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు ఎస్‌ఈసీ బ్రేకులు 

అన్ని కార్యకలాపాలు తక్షణమే నిలుపుదల చేయాలని ఆదేశాలు

స్ట్రాంగ్‌ రూమ్‌లకు బ్యాలెట్‌పత్రాలు

ఎన్నికల పనులకు తాత్కాలిక విరామం

ఎన్నికల కోడ్‌ కొనసాగింపు


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): జడ్పీటీసీ, ఎంపీటీసీలకు వారం రోజుల్లో ఎన్నికలు జరగాలి. పంచాయతీల తొలిదశ ఎన్నికలకు ఆదివారం నోటిఫికేషన్‌ వెలువడాలి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ కారణంగా ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రకటించారు. తరువాత కొద్దిసేపటికే జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి. దీంతో ఎన్నికల ప్రక్రియ మొత్తం నిలుపుదల చేశారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనతో ఆయా రాజకీయ పార్టీలు, పోటీలో వున్న అభ్యర్థుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ పనులను ప్రస్తుతానికి అటకెక్కించింది. ఎన్నికలకు సంబంధించిన అన్ని పనులను తాత్కాలికంగా పక్కన పెట్టారు. బ్యాలెట్‌పత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలిస్తున్నారు. అయితే ఎన్నికలు వాయిదా పడినప్పటికీ ఎన్నికల కోడ్‌ యథావిధిగా అమల్లో వుంటుందని అధికారులు తెలిపారు.


 స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు ఈ నెల ఏడున నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలు వెంటనే రంగంలోకి దిగి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టాయి. తరువాత 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రిటర్నింగ్‌ నామినేషన్లు స్వీకరించారు. ఇదే సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు బీ ఫారాలు జారీ చేశాయి. 12న నామినేషన్ల పరిశీలన, 13న అప్పీళ్లు, 14న ఉపసంహరణ ప్రక్రియను నిర్వహించి, పోటీలోవున్న అభ్యర్థుల జాబితాలను అధికారులు విడుదల చేశారు. ఇదే సమయంలో ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీలో వున్న స్థానాలను ఏకగ్రీవం అయినట్టు ప్రకటించారు. ఆదివారం పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేయడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. 21వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు జిల్లా పరిషత్‌ రిటర్నింగ్‌ అధికారి ఆదేశాలు ఇచ్చారు. బ్యాలెట్‌ పత్రాల ముద్రణ జరుగుతున్న సమయంలో ఆదివారం ఉదయం ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనతో అఽధికారులు అప్రమత్తమయ్యారు.


కొద్దిసేపటికి అధికారిక ఉత్తర్వులు రావడంతో బ్యాలెట్‌ పత్రాల ముద్రణ నిలిపివేయించారు. అప్పటికే ముద్రించిన బ్యాలెట్‌ పత్రాలను భద్రపరచాలని నిర్ణయించారు. ఇందుకోసం స్టా్ట్రంగ్‌రూమ్‌లను జిల్లా యంత్రాంగం పరిశీలించింది. ఎస్‌ఈసీ తాజా నిర్ణయంతో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ ప్రక్రియ నిలిపివేశారు. అయితే పోలింగ్‌ నిర్వహణకు సంబంధించి ఆదివారం దాదాపు అన్ని మండల/ డివిజన్‌ కేంద్రాల్లో సిబ్బందికి మాత్రం శిక్షణ పూర్తిచేశారు. కాగా ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడినప్పటికీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. కొత్తపథకాలు అమలు కావు. కొత్తగా అభివృద్ధి పనులు ప్రారంభించకూడదు. మంత్రుల అధికారిక పర్యటనలు, అధికారులతో సమీక్షలు ఉండవు. 

Updated Date - 2020-03-16T06:37:29+05:30 IST