-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » LG Polymers
-
రూ.10 వేలు ఏ మూలకు?
ABN , First Publish Date - 2020-05-13T09:03:03+05:30 IST
ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువు ప్రభావం నుంచి వెంకటాపురం గ్రామం ఇంకా కోలుకోలేదు.

సాయం చాలదంటున్న పాలిమర్స్ బాధితులు
ఇంకా ఊళ్లను వీడని విషవాయువు
నివాసం ఉండడానికి భయపడుతున్న జనం
ఇల్లు మొత్తం రంగులు వేస్తే తప్ప వాసన పోయేలా లేదు
రూ.30 వేల వరకూ అవసరం
ఇళ్లలో ఉన్న నిత్యావసర సరకులన్నీ బయట పారబోత
అవి కూడా కొనుగోలు చేసుకోవాలి
ప్రభుత్వ సాయం పెంచాలని వినతి
సాధారణ పరిస్థితి ఇప్పట్లో సాధ్యం కాదు
మంత్రులు ఒకరోజు రాత్రి బస చేసినంత మాత్రాన భరోసా ఉండదు
గోపాలపట్నం, మే 12:
ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువు ప్రభావం నుంచి వెంకటాపురం గ్రామం ఇంకా కోలుకోలేదు. మంత్రులు సోమవారం రాత్రి వెంకటాపురం, నందమూరి నగర్, పద్మనాభనగర్, కంపరపాలెం, ఎస్సీ బీసీ కాలనీల్లో బస చేశారు. సాధారణ పరిస్థితి నెలకొందని, అంతా బాగానే వుందని, ఇళ్లకు రావచ్చునని ఆయా గ్రామాల ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు ఇందుకు అనుకూలంగా లేవు. విషవాయువుల వాసన ఇంకా వస్తూనే ఉంది. దీంతో గ్రామాల్లో వుండడానికి ప్రజలు భయపడుతున్నారు.
ఆర్థిక సాయం ఏ మూలకు..
ఎల్‌జీ పాలిమర్స్ ఘటనలో మృతిచెందినవారు, అనారోగ్యానికి గురైన వారిలో అత్యధికులు వెంకటాపురం వాసులు ఉన్నారు. ఇక్కడ ఇళ్లు, పరిసరాలు మొత్తం ఇంకా విషవాయువుతో నిండి ఉన్నాయి. సంఘటన జరిగిన నాలుగైదు రోజుల తరువాత ఇళ్లను శుభ్రం చేసుకుందామని వచ్చినవారు, ఘాటైన గ్యాస్ వాసనతో మరోసారి అస్వస్థతకు గురవుతున్నారు. ఇల్లు మొత్తం రంగులు వేస్తే తప్ప ఈ వాసన పోదని, ఇంకా ఇళ్లలో వున్న ఆహార పదార్థాలన్నీ విషపూరితం కావడంతో చెత్తకుప్పలో పడేయాల్సి వచ్చిందని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాల్లో ప్రతి వ్యక్తికి రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించిందని, ఈ సొమ్ము ఇళ్లకు రంగులు వేయడానికి, మరమ్మతులు చేసుకోవడానికి, నిత్యావసర సరకులు కొనుగోలు చేయడానికి చాలవని, ఆర్థిక సాయాన్ని మరింత పెంచాలని కోరుతున్నారు. మంత్రులు ఒకరోజు రాత్రి గ్రామాల్లో నిద్ర చేసి వెళ్లినంత మాత్రాన తమకు పూర్తిస్థాయి భరోసా లభించదని బాధితులు అంటున్నారు.
సాయం ఏమాత్రం సరిపోదు
నేను క్యాన్సర్ వ్యాధితో చాలాకాలంగా బాధపడుతున్నాను. ఏ కష్టం వచ్చినా నా కుమార్తె వరలక్ష్మి చూసుకునేది. విషవాయువు లీకైన ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు నాకు దిక్కులేకుండా పోయింది. విషవాయువు ప్రభావం వల్ల ఇంట్లోని నిత్యావసర సరకులన్నీ బయట పారబోశాను. ఇంటిలో ఇంకా ఘాటైన విషవాయువుల వాసన తగ్గలేదు. ఇల్లు మొత్తం రంగులు వేస్తే తప్ప ఈ వాసన పోయేలా లేదు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం ఏ మూలకు సరిపోదు.
- ఆకుల మహాలక్ష్మి (మృతురాలు పి.వరలక్ష్మి తల్లి), వెంకటాపురం
ఆహార దినుసులు పారబోశాం
విషవాయువు ఇళ్లలోకి చొరబడడంతో ఇంట్లోని ఆహార దినుసులను వాడొద్దని అధికారులు చెప్పారు. దీంతో నిత్యావసర సరకులన్నీ బయట చెత్తకుప్పలో వేశాం. లాక్‌డౌన్ వల్ల పనులు లేక ఆర్థిక ఇబ్బంది పడుతున్న తరుణంలో గ్యాస్ లీక్ దుర్ఘటన మరింత ఇబ్బందికి గురిచేసింది. విషవాయువు ఇంటి గోడలకు అంటుకుపోయి ఘాటైన వాసన వస్తోంది. మొత్తం రంగులు వేయాలంటే సుమారు రూ.30 వేలు అవుతుంది. నిత్యావసర సరకుల కోసం మరో రూ.10 వేలు కావాలి. ప్రభుత్వం మరింత సాయం చేయాలి.
- ఉషారాణి, వెంకటాపురం
ప్రభుత్వం ఆదుకోవాలి
నేను, నా భార్య అనారోగ్యంతో బాధపడుతున్నాం. ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడినా సాధారణ పరిస్థితికి చేరుకోవడం ఇప్పట్లో జరగని పని. ఇల్లు గడవాలంటే నా కుమార్తె సంపాదనే ఆధారం. ప్రస్తుతం ఇంటికి మరమ్మతులు చేసుకుని, సరకులు కొనుక్కుని మునుపటిలా జీవనం సాగించాలంటే ప్రభుత్వ ప్రకటించిన సాయం సరిపోదు. ఆర్థిక సాయం పెంచడంతోపాటు కొన్ని నెలల పాటు ఆర్థిక భరోసా కల్పించాలి.
- కిల్లంపల్లి ఉమామహేశ్వరరావు, వెంకటాపురం