లారీ ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-12-30T06:09:39+05:30 IST

మండలంలోని డౌనూరు శివారులోని ఘాట్‌రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు.

లారీ ఢీకొని యువకుడి మృతి
ఘాట్‌ రోడ్డులో ప్రమాద దృశ్యం

డౌనూరు శివారు ఘాట్‌ రోడ్డులో ప్రమాదంకొయ్యూరు, డిసెంబరు 29: మండలంలోని డౌనూరు శివారులోని ఘాట్‌రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం... జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీ బలిజపేటకుకు చెందిన పాంగి ప్రసాదరావు రావికమతం మండలం మేడివాడకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. మైదాన ప్రాంతం నుంచి సిమెంట్‌ లోడుతో చింతపల్లి వెళుతున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొంది. దీంతో ప్రసాదరావు అక్కడికక్కడే మృతిచెందాడు. చింతపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడి దుర్మరణం


ఎలమంచిలి: మండలంలోని నారాయణపురం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు... ఎలమంచిలి పట్టణంలోని తులసీనగర్‌కు చెందిన కె.అప్పారావు(70) తెరువుపల్లిలో ఉన్న తన పొలానికి మంగళవారం తెల్లవారుజామున సైకిల్‌పై బయలుదేరాడు. దారిలో నారాయణపురం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు  రూరల్‌ స్టేషన్‌ హెచ్‌సీ శ్యామ్‌ తెలిపారు. 


యువకుడి ప్రాణాలు తీసిన ఎక్స్‌కవేటర్‌ 


పాయకరావుపేట రూరల్‌: మండలంలోని నామవరం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందినట్టు ఎస్‌ఐ దీనబంధు చెప్పారు. మంగవరం గ్రామానికి చెందిన గంటేడ శ్రీనివాసరావు (27) నక్కపల్లిలో సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై సొంతూరు బయలుదేరాడు. నామవరం వద్ద రోడ్డుపై నిలిపివున్న ఎక్స్‌కవేటర్‌ను ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతనిని కాకినాడలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2020-12-30T06:09:39+05:30 IST