పైరవీలకు పెద్దపీట!
ABN , First Publish Date - 2020-12-07T06:20:29+05:30 IST
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ రేషన్ సరకులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న మినీ ట్రక్కుల లబ్ధిదారుల ఎంపికలో వైసీపీ నాయకుల సిఫారసులకే అధికారులు పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

మినీట్రక్కుల లబ్ధిదారుల ఎంపికలో వైసీపీ నేతల హవా
అధికారులకు జాబితాలు ఇచ్చిన కిందిస్థాయి నాయకులు
ఎమ్మెల్యేల నుంచి మౌఖిక ఆదేశాలు
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికారులు సతమతం
తుది జాబితాల్లో ‘ఆ పేర్లు’కే ప్రాధాన్యం ఇచ్చినట్టు భోగట్టా
ఈ వారంలోనే అధికారిక ముద్ర?
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ రేషన్ సరకులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న మినీ ట్రక్కుల లబ్ధిదారుల ఎంపికలో వైసీపీ నాయకుల సిఫారసులకే అధికారులు పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా స్థానిక నాయకులు చెప్పిన పేర్లకు ఆయా జాబితాల్లో ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిసింది. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం... కొత్తగా వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. గ్రామాల్లో 50 కుటుంబాలకు ఒకరిచొప్పున, పట్టణ ప్రాంతాల్లో 100 కుటుంబాలకు ఒకరి చొప్పున వలంటీర్లను నియమించింది. ఇప్పటి వరకు రేషన్ డిపోల్లో పంపిణీ చేస్తున్న సరకులను, వచ్చే నెల నుంచి నేరుగా కార్డుదారుల ఇళ్ల వద్దనే అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను వలంటీర్లకు అప్పగించింది. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి యథావిధిగా రేషన్ డీలర్లకు సరకులు వస్తాయి. ఇక్కడి నుంచి ఆయా వలంటీర్లు తమ పరిధిలోని కార్డుదారుల సరకులు తీసుకుని, ప్రత్యేక వాహనాల ద్వారా ఇళ్లకు తీసుకెళ్లి అందజేస్తారు. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీలకు సబ్సిడీపై వాహనాలు (మినీ ట్రక్కులు) అందజేయాలని నిర్ణయించింది. విశాఖ జిల్లాలో రేషన్ డిపోలు, వాటి పరిధిలోని కార్డులను పరిగణనలోకి తీసుకుని 821 వాహనాలను మంజూరు చేసింది. వీటి కోసం 7,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు ప్రతినెల రూ.10 వేల చొప్పున వేతనంతోపాటు మరో రూ.3 వేలు వాహనం నిర్వహణ కోసం చెల్లిస్తారు. అయితే లబ్ధిదారులు తమ వాటాగా రూ.58,119 చెల్లించాలి. ఆయా కార్పొరేషన్లు 60 శాతం... అంటే రూ.3,48,714 రాయితీగా భరిస్తాయి. 30 శాతం... అంటే రూ.1,74,357 బ్యాంకు రుణం వుంటుంది.
భారీగా ఆశావహులు
సుమారు రూ.60 వేల పెట్టుబడితోనే మినీ ట్రక్కు సమకూరుతుండడం, నెలవారీ నికర ఆదాయం లభిస్తుండడంతో ఆశావహులు భారీఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఈ నెల నాలుగో తేదీన అధికారులు ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగానే జరుగుతుందని అధికారులు చెప్పారు. కానీ తెరవెనుక పరిస్థితి మరోలా వుందని, ఎవరిని ఎంపిక చేయాలో అధికార పార్టీ నాయకులు జాబితాలను తయారు చేసి తమ నియోజకవర్గం ఎమ్మెల్యేతోపాటు ఆయా అధికారులకు అందజేసినట్టు తెలిసింది. తమ పార్టీ గ్రామ/ వార్డు నాయకులు సిఫారసు చేసిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని ఎమ్మెల్యేల నుంచి ఆయా అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం.
కాగా విద్యార్హతలకు, ఎల్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్, వాహన రవాణాకు సంబంధించిన అవగాహనకు, ఇతర విషయాలపై ఆయా అభ్యర్థులకు మార్కులు వేసి, షార్ట్ లిస్టులను తయారు చేసి, సంబంధిత కార్పొరేషన్ అధికారులకు పంపుతున్నారు. వీటిని పరిశీలించిన ఆయా అధికారులు... కలెక్టర్‌కు పంపిస్తారు. తుది జాబితాను కలెక్టర్ ఆమోదించి జిల్లా ఇన్‌చార్జి మంత్రికి నివేదిస్తారు. అనంతరం ఎంపికైన లబ్ధిదారుల వివరాలను కలక్టరేట్, ఆయా కార్పొరేషలు, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలు, గ్రామ/ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. కాగా అధికార పార్టీ నాయకుల సిఫారసు చేసిన పేర్లు ముందు వరుసలో వుండేలా జాబితాలు తయారు చేసి జిల్లా అధికారులకు పంపుతున్నట్టు తెలిసింది. ఈ వారంలోనే ఆమోద ముద్ర పడుతుందని అంటున్నారు.