21 నుంచి భూముల సర్వే...
ABN , First Publish Date - 2020-12-10T06:07:24+05:30 IST
జిల్లాలో ఈ నెల 21 నుంచి భూముల సర్వే ప్రారంభం కానున్నది. మొత్తం 3,040 గ్రామాలకుగాను తొలివిడత 965 గ్రామాల్లో సర్వే చేపడతారు.

తొలివిడత 965 గ్రామాలు ఎంపిక
విశాఖపట్నం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 21 నుంచి భూముల సర్వే ప్రారంభం కానున్నది. మొత్తం 3,040 గ్రామాలకుగాను తొలివిడత 965 గ్రామాల్లో సర్వే చేపడతారు. ఈ ప్రక్రియ ఆరు నెలలపాటు సాగుతుంది. విశాఖ డివిజన్‌లో 75 గ్రామాలు, అనకాపల్లిలో 135, నర్సీపట్నం డివిజన్‌లో 90, పాడేరు డివిజన్‌లో 713 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తారు. డ్రోన్ల సాయంతో భూముల సర్వే నిర్వహించడానికి ప్రతి గ్రామానికి మూడు బృందాలను నియమించారు. సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. సర్వే విభాగంతోపాటు గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సర్వేయర్లు, ప్లానింగ్ సెక్రటరీలు ఈ పనుల్లో పాలుపంచుకుంటారు. వీరందరికీ దశల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి, సర్వే ఉద్దేశాలను ప్రజలకు వివరిస్తారు. భూ యజమానుల హాజరుతో నిమిత్తం లేకుండా.. రికార్డుల మేరకు భూములను సర్వే చేస్తారు. కాగా భూముల సర్వే ప్రారంభానికి ముందు తొలివిడత సర్వే చేపట్టనున్న 965 గ్రామాల రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తిచేయాల్సి ఉంది. ఆయా గ్రామాల రికార్డులు ఈ నెల 21లోగా స్వచ్ఛీకరణ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. సర్వే అనంతరం భూములున్న ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు అందజేస్తారు.