రియల్‌ డబుల్‌!

ABN , First Publish Date - 2020-08-12T10:02:13+05:30 IST

ఆలు లేదు...చూలు లేదు..కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది విశాఖపట్నంలో పరిస్థితి.

రియల్‌ డబుల్‌!

రాజధాని పేరు చెప్పి రెట్టింపు ధరలు


నగరంలో వ్యాపారుల హడావిడి

అధికార పార్టీ నాయకులే ఎక్కువ

అపార్టుమెంట్‌ ఫ్లాట్లు, స్థలాల రేట్లు భారీగా పెంపు

డిమాండ్‌ మాత్రం నిల్‌

కరోనా ఎఫెక్ట్‌

15న కేపిటల్‌కు శంకుస్థాపన జరగబోతుందంటూ బిల్డర్‌ అయిన ఒక ప్రజాప్రతినిధికి చెందిన సంస్థ నుంచి ఫోన్లు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఆలు లేదు...చూలు లేదు..కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది విశాఖపట్నంలో పరిస్థితి. పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తారంటూ విశాఖ చుట్టూ 50 కి.మీ. పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని భారీగా విస్తరించారు. ధరలు రెట్టింపు చేశారు. ప్రభుత్వం ఇటీవల మార్కెట్‌ విలువలు సవరించడం కూడా వీరికి కలిసి వచ్చింది.


నగరంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన ఓ నాయకుడైతే...ఈ నెల 15న విశాఖలో పరిపాలనా రాజధానికి శంకుస్థాపన (భూమి పూజ) చేస్తారని, ఈలోగా తన భారీ వెంచర్‌లో ఫ్లాట్‌ బుక్‌ చేసుకుంటే...రూ.10.5 లక్షల వరకు డిస్కౌంట్‌ లభిస్తుందంటూ మొబైల్‌ ఫోన్ల ద్వారా ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ 15వ తేదీ తరువాత రేట్లు పెరిగిపోతాయని, ఈలోగానే అవకాశం దక్కించుకోవాలని ఆ సంస్థ తరపున ఫోన్లు చేసి చెబుతున్నారు. మరో నాయకుడైతే...భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారని, అక్కడి వరకు మెట్రో రైలు వస్తుందని, ఇప్పుడే ఇంటి స్థలం బుక్‌ చేసుకోవాలంటూ ఉద్యోగుల వెంట పడుతున్నారు. నగరంలో ఏ రైతుబజారుకు వెళ్లినా...ఈ సంస్థల ఏజెంట్లు బ్రోచర్లు పట్టుకొని వెంటపడుతున్నారు.


డిమాండ్‌ ఏదీ?

విశాఖపట్నంలో భూముల ధరలు, ఫ్లాట్ల ధరలు ఎప్పుడూ అధికంగానే ఉంటాయి. గత కొద్దికాలంగా ఆర్థిక మందగమనం వల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగం నేలచూపులు చూస్తోంది. కరోనా వచ్చిన తరువాత పరిస్థితి మరీ దారుణంగా మారింది. అనేక నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయి. అయితే పూర్తయిన అపార్ట్‌మెంట్లు కూడా కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. కానీ వాటిని ఏదో ఒక రేటుకు అమ్ముకొని బయటపడదామనే ధోరణి బిల్డర్లలో కూడా కనిపించడం లేదు. రాజధాని అంశం ఒకటి ఊరిస్తుండడంతో అంతా వాటిని అలాగే ఉంచుకున్నారు. ఇప్పుడు రాజధాని ప్రకటన చేశాక...కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రాకపోయినా రేట్లు మాత్రం పెంచేశారు.


ఎండాడలో అపార్ట్‌మెంట్లలో చ.అ. రూ.3,500 ఉండేది. ఇక్కడ రెండు ప్రధాన సంస్థలు భారీ సంఖ్యలో ఫ్లాట్లను నిర్మించి విక్రయిస్తున్నాయి. ఇప్పుడు వాటిలో చ.అ. రూ.4,500 నుంచి రూ.5 వేలు చెబుతున్నారు. మధురవాడ ప్రాంతంలో చ.అ. రూ.5 వేలు చెబుతున్నారు. 


ఇక భూముల విషయానికి వస్తే కాపులుప్పాడలో ఐటీ లేఅవుట్‌ వేసిన తరువాత గజం రూ.10 వేలు నుంచి రూ.15 వేలకు పెరిగింది. ఇప్పుడు రాజధాని భవనాలు అక్కడే వస్తాయని ప్రచారం జరగడంతో రూ.30 వేలు పలుకుతోంది. రుషికొండ ఐటీ పార్కు ప్రాంతంలో గజం రూ.35 వేల ధర ఉండగా, ఇప్పుడు రూ.55 వేలు చెబుతున్నారు. ఆ రేటు ఇస్తామన్నా ఎవరూ అమ్మడానికి ముందుకు రావడం లేదు. 


ఆనందపురం జంక్షన్‌ సమీపంలో గజం రూ.30 వేలు ఉండేది. ఇప్పుడు రూ.50 వేలు చెబుతున్నారు. అటు పెందుర్తి రోడ్డు వైపు ప్రధాన మార్గానికి ఇరువైపులా పదుల సంఖ్యలో లేఅవుట్లు వెలిశాయి. రోడ్డు పక్కనుంటే గజం రూ.20 వేలు, లోపలకు వెళితే రూ.15 వేలు చొప్పున చెబుతున్నారు. భోగాపురం వైపు గజానికి రూ.10 వేలు పెడితే మంచి ప్రాంతంలో స్థలం లభించేది. ఇప్పుడు రెట్టింపు రేటు చెప్పి రూ.15 వేలు ఇస్తున్నారు. అధికార పార్టీ నాయకులకే ఇక్కడ ఎక్కువ భూములు ఉన్నాయి. అయితే ఇంతకు ముందులా కొనడానికి ఎన్‌ఆర్‌ఐలు రావడం లేదు. రాజధాని రాకపోతే లేదా మళ్లీ మారిపోతే...పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నగరంలో వ్యాపారులు డిమాండ్‌ అంతగా లేకపోయినా రేట్లు మాత్రం భారీగా పెంచేశారు. 

Updated Date - 2020-08-12T10:02:13+05:30 IST