వైసీపీ నేత భూ దందా

ABN , First Publish Date - 2020-11-06T06:12:25+05:30 IST

గాజువాకలో నేర చరిత్ర కలిగిన వైసీపీ నాయకుడు తెగ రెచ్చిపోతున్నాడు. అధినాయకుల అండ చూసుకొని ప్రభుత్వ భూముల కబ్జాకు తెగబడుతున్నాడు.

వైసీపీ నేత భూ దందా
ఆక్రమిత స్థలంలో వీఎంఆర్‌డీఏ ఏర్పాటు చేసిన బోర్డు

కూర్మన్నపాలెంలో రూ.3 కోట్ల వీఎంఆర్‌డీఏ స్థలం కబ్జా

అధికారులు అడ్డుకున్నందుకు బెదిరింపులు

బదిలీ చేయించేస్తానని హెచ్చరికలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గాజువాకలో నేర చరిత్ర కలిగిన వైసీపీ నాయకుడు తెగ రెచ్చిపోతున్నాడు. అధినాయకుల అండ చూసుకొని ప్రభుత్వ భూముల కబ్జాకు తెగబడుతున్నాడు. అడ్డుకునేందుకు యత్నించిన అధికారులకు ఫోన్లు చేసి, చూసీచూడనట్టు పోవాలని, లేదంటే... బదిలీ చేయించేస్తానని బెదిరిస్తున్నాడు.


ఇదీ కథ.

మహా విశాఖ నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) 2010లో కూర్మన్నపాలెంలోని సర్వే నంబర్లు 15/పి, 16/పి, 20/పిలలో లేఅవుట్‌ వేసి గృహ నిర్మాణాలకు స్థలాలు విక్రయించింది. ఏ సంస్థ అయినా లేఅవుట్‌ వేస్తే మొత్తం విస్తీర్ణంలో పది శాతం సామాజిక అవసరాల (పాఠశాల, ఆస్పత్రి, పార్కు, గ్రంఽథాలయం, పోస్టాఫీసు, బ్యాంక్‌)కు కేటాయించాలి. ఆ విధంగా ఫేజ్‌-1 లేఅవుట్‌లో 60 అడుగుల రహదారిని ఆనుకొని 1.05 ఎకరాల స్థలాన్ని స్కూల్‌ కోసం వీఎంఆర్‌డీఏ కేటాయించింది. దానిపక్కనే పోస్టాఫీసు కోసం 1.2 ఎకరాలు ఇచ్చింది. అయితే అక్కడ ఎటువంటి పాఠశాల ఏర్పాటు చేయకపోవడంతో ఆ స్థలం ఖాళీగా ఉంది. దానిపై నేర చరిత్ర కలిగిన ఓ అధికార పార్టీ నాయకుడి కన్ను పడింది. తన మనుషులను రంగంలోకి దింపి గత పదిహేను రోజులుగా అక్కడ పెరిగిపోయిన తుప్పలు, మొక్కలు తొలగించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదుచేశారు. వారు స్పందించకపోవడంతో వీఎంఆర్‌డీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ భూములను రక్షించాలని, ఆక్రమణలకు గురికాకుండా చూడాలని ఇటీవల మంత్రులు హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించారు. కూర్మన్నపాలెం వెళ్లి ఆ స్థలంలోకి ఎవరూ రాకూడదని, అది వీఎంఆర్‌డీఏది చెందినదంటూ బోర్డు పెట్టి వచ్చారు. ఆ తరువాత కూడా వరుసగా మూడు రోజులు వెళ్లి అక్కడి పరిస్థితిని గమనించడం ప్రారంభించారు. ఈ విషయం తెలిసి సదరు వైసీపీ నాయకుడికి కోపం వచ్చింది. వెంటనే విశాఖలోని వీఎంఆర్‌డీఏ ఎస్టేట్‌ అధికారికి ఫోన్‌ చేసి ‘ఎక్కువ చేస్తున్నారు’ అంటూ బెదిరించారు. అది వీఎంఆర్‌డీఏ స్థలమని, ఆక్రమిస్తే ఊరుకోబోమని సీనియర్‌ అయిన ఆ అధికారి ఏమాత్రం తగ్గకుండా సమాధానం చెప్పడంతో సదరు నాయకుడు వెర్రెక్కిపోయాడు. మళ్లీ కూర్మన్నపాలెం ఛాయలకు రావద్దని, ఆ ఆక్రమణ వైపు తొంగిచూస్తే... వీఎంఆర్‌డీఏ నుంచి బదిలీ చేయించేస్తానని బెదిరించాడు. దానికి కూడా ఆ అధికారి భయపడలేదు. సంస్థ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని, నచ్చింది చేసుకోవాలని చెప్పారు. దీనిపై వీఎంఆర్‌డీఏలో చర్చ నడుస్తోంది. ఇటు చూస్తే కబ్జాలు జరిగితే ఊరుకోబోమని మంత్రులు చెబుతున్నారని, అటు చూస్తే అధికార పార్టీ నేతలే ఆక్రమణలకు తెగబడుతున్నారని...ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఎలా చేయాలంటూ తలలు పట్టుకుంటున్నారు.

Updated Date - 2020-11-06T06:12:25+05:30 IST