కోరమాండల్‌ కలకలం

ABN , First Publish Date - 2020-10-13T18:19:08+05:30 IST

పారిశ్రామిక ప్రాంతం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు..

కోరమాండల్‌ కలకలం

కంపెనీ నుంచి ఘాటైన వాయువు రాకతో ఉలిక్కిపడిన పారిశ్రామిక ప్రాంతం

పలువురికి అస్వస్థత... 


మల్కాపురం(విశాఖపట్నం): పారిశ్రామిక ప్రాంతం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు కోరమాండల్‌ ఎరువుల కర్మాగారం నుంచి ఒక్కసారిగా ఘాటైన వాసన వెలువడడంతో సమీప ప్రాంతవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏం జరుగుతుందో తెలియక పిలకవానిపాలెం, కుంచమాంబ కాలనీ, కోడిపందెల దిబ్బ, శ్రీనివాసనగర్‌, శ్రీరామ్‌నగర్‌, ములగాడ, చినములగాడ, ఎదురువానిపాలెం, గొందేశివానిపాలెం పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. పిలకవానిపాలెంలో నలుగురు, కుంచమాంబ కాలనీలో ఒకరు అస్వస్థతకు గురికావడంతో గ్రామస్థులంతా రోడ్డెక్కి కోరమాండల్‌ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ కంపెనీ అధికారులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు, గాజువాక ఎస్‌ఐ సూర్యప్రకాశ్‌ పిలకవానిపాలెం వెళ్లారు.


అక్కడి సచివాలయంలో కోర మాండల్‌ అధికారులు, స్థానిక పెద్దలతో ఎస్‌ఐ సమావేశం ఏర్పాటుచేశారు. అస్వస్థతకు గురైన వారికి కోరమాండల్‌ అధికారులు వైద్యం చేయించారు. కాగా కంపెనీ అధికారులు కోరమాండల్‌లోని అన్ని యూనిట్లను తనిఖీ చేశారు. అన్ని యూనిట్లు మూసి వున్నాయని, ఘాటైన వాయువు తమ కంపెనీ నుంచి వచ్చింది కాదని వారు చెప్పారు. అయితే కోరమాండల్‌ నుంచే వాసన వచ్చిందని, ఆ తరువాత పెద్ద శబ్దం కూడా వచ్చిందని సమీప ప్రాంత ప్రజలు చెబుతున్నారు. చాలామంది కళ్లు మంటలు, దగ్గు, గొంతు మంటతో బాధపడ్డారని అంటున్నారు.


Updated Date - 2020-10-13T18:19:08+05:30 IST