‘కళింగ వార్‌’తో కీర్తిపతాకం ఎగురవేయాలి

ABN , First Publish Date - 2020-02-16T08:29:11+05:30 IST

‘కళింగ వార్‌’తో కీర్తిపతాకం ఎగురవేయాలి

‘కళింగ వార్‌’తో కీర్తిపతాకం ఎగురవేయాలి

  • హాలీవుడ్‌లో మన సత్తా చూపాలి
  • స్వదేశీ, విదేశీ నటులు నటించే భారీ బడ్జెట్‌ చిత్రమిది
  • కళింగ యుద్ధాన్ని ప్రపంచానికి చాటిచూపుతా..
  • ‘ఆంధ్రజ్యోతి’తో దర్శకుడు, శ్రీకాకుళం యువకుడు జగదీశ్‌ దానేటి 


ఆశీల్‌మెట్ట, ఫిబ్రవరి 15: భారత దేశ చరిత్రలో కళింగ యుద్ధానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. అశోకుని చివరి యుద్ధంగా చరిత్రలో నిలిచింది. అశోకుడిని అడ్డుకునేందుకు నాడు కళింగ ప్రాంతీయులు చేసిన పోరాటం నభూతో న భవిష్యత్‌ అనే చెప్పాలి. పురుషులు, మహిళలు, చిన్నారులు సైతం నాటి యుద్ధంలో పాల్గొన్నారు. ఆ యుద్ధంలో రక్తపుటేర్లను చూసిన అశోకుడు మనసు చలించి బుద్ధిజం తీసుకుని శాంతిమార్గంలో ప్రయాణించాడు. నాటి కళింగ యుద్ధం నేడు అంతర్జాతీయ స్థాయిలో వెండితెరకెక్కనున్నది. ఇండియాలోని పలు భాషలకు చెందిన నటీనటులతో పాటు హాలీవుడ్‌ నటులు కూడా ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ చరిత్రాత్మకమైన చిత్రాన్ని తెరకెక్కించనున్నది మన తెలుగువాడే... ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగదీశ్‌ దానేటి. మరో విశేషమేమిటంటే జగదీశ్‌ కూడా కళింగ రాజవంశీయుడు కావడం. ఈ సినిమా గురించి ప్రకటించేందుకు విశాఖ వచ్చిన ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..


హాలీవుడ్‌ అంటే ఇష్టం

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మా స్వస్థలం. విద్యాభ్యాసం విశాఖలో సాగింది. ఏయూలో హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో పీజీ చేశాను. చిన్నప్పటి నుంచి సినీరంగమంటే పిచ్చి. ముఖ్యంగా హాలీవుడ్‌ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలోనే రోజుకొక ఇంగ్లిషు మూవీ చూసేవాడిని. ఎప్పటికైనా హాలీవుడ్‌లో సినిమా తీసి తెలుగువాడిగా మంచి గుర్తింపు పొందాలని గట్టిగా నిర్ణయించుకున్నా. 


తెలుగులో టిప్పు సినిమాకు దర్శకత్వం వహించా..

పీజీ తర్వాత కొంతకాలానికి తెలుగు చిత్రసీమలో రచయితగా కొంతకాలం పనిచేశాను. ఆ తర్వాత దర్శక, రచయితగా టిప్పు చిత్రం తీశాను. ఆ చిత్రాన్ని అదే టైటిల్‌తో బాలీవుడ్‌లో విడుదల చేశా. 


హాలీవుడ్‌ వైపు అడుగులు

టాలీవుడ్‌లో ఉండగా అమెరికాలోని కాలిఫోర్నియాలో  ఖచ్చపి స్వరధార అనే ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ స్కూలు నడుపుతున్న ఎన్‌ఆర్‌ఐ లలితాపద్మిని ఖచ్చపి పరిచయమయ్యారు. ఆమె సహకారంతో అమెరికా వెళ్లగా చాలా ప్రోత్సహించారు. ఎన్‌ఆర్‌ఐ కథలపై పనిచేశాను. తర్వాత పింక్‌ జాక్వర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సువర్ణపప్పు (యూఎస్‌ఏ) పరిచయమయ్యారు. ఆమె పాతికేళ్లుగా యూఎ్‌సఎలో సినిమా వర్క్స్‌ చేస్తున్నారు. ఆ జర్నీలో జానీమార్టిన్‌ పరిచయమవ్వడంతో ఆయన సపోర్ట్‌ లభించింది. 


కళింగ వార్‌ తీయాలనే ఆలోచన..

నేను కళింగ రాజ కుటుంబానికి చెందినవాడిని. చిన్నప్పటి నుంచి కళింగ యుద్ధం గురించి కథలుగా చెప్పడం విన్నాను. అశోకుడిని అడ్డుకునేందుకు జరిగిన కళింగ యుద్ధంలో పురుషులు మరణిస్తే... మహిళలు, చిన్నారులు సైతం యుద్ధం చేసి వీరమరణం పొందారు. ఆ రక్తపాతాన్ని చూసి అశోకుడు చలించాడని, రక్తసంద్రంలో తెల్ల కలువ వలె అశోకుడు మారి బుద్ధిజం తీసుకున్నాడని చెబుతారు. అంత గొప్ప యుద్ధాన్ని తెరకెక్కించాలని... అదీ హాలీవుడ్‌లో తీయాలని ఆశయంగా పెట్టుకున్నా. 


ఎంతో పరిశోధన చేశా..

కళింగ వార్‌ చిత్రం తీసేందుకు ఎంతో పరిశోధన చేశా. ఎందర్నో కలిశా. పుస్తకాలు, చరిత్ర చదివా. ముఖ్యంగా ఈ చిత్రంలో అశోకుడి గొప్పతనంతో పాటు కళింగ ప్రాంతీయుల తెగువ, ధైర్యం చూపాలన్నదే నా ధ్యేయం.


ఇండియాతో పాటు హాలీవుడ్‌ నటులు

ఈ సినిమాకు సంబంధించి ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. నటులను ఎంపిక చేస్తున్నాం. టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు పలు భాషలకు చెందిన ప్రముఖ నటులతో పాటు హాలీవుడ్‌ నటీనటులు ఇందులో ఉంటారు. హాలీవుడ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తా. టైటిల్‌ రోల్‌ కోసం ఇంకా ఎవరినీ ఫైనలైజ్‌ చేయలేదు. టాలీవుడ్‌ నటుల ఎంపికలో వీరూమామ వీటీమ్‌ భాగస్వామ్యం ఉంటుంది.


భారీ బడ్జెట్‌ మూవీ

కళింగ వార్‌ భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కనున్నది. ఒక్క భారతదేశానికి సంబంధించిన యూనిట్‌కే రూ.150 కోట్లు పైమాటే ఖర్చవుతుంది. స్వదేశంతో పాటు జార్జియా ఇతర దేశాల్లో తీస్తాం. హాలీవుడ్‌తో కలిపి వందల కోట్లు ఖర్చవుతుంది. మొత్తం బడ్జెట్‌ ఇంకా ఫైనలైజ్‌ చేయాలి.


ఒక యజ్ఞంలా పనిచేస్తున్నాం

ఈ చిత్రానికి హాలీవుడ్‌లో టైటానిక్‌, మ్యాట్రిక్స్‌ వంటి గొప్ప సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన దర్శకుడు, నిర్మాత , నటుడు జానీమార్టిన్‌ మాతో భాగస్వామి కావడం గొప్ప బలంగా మారింది. పింక్‌ జాక్వర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సువర్ణ పప్పు చిత్ర నిర్మాణంలో భాగస్వామి కావడం చాలా గర్వంగా ఉంది. మేమంతా కలిసి ఒక యజ్ఞంలా పనిచేస్తున్నాం. ప్రపంచంలోని అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం.


హాలీవుడ్‌లో భారత కీర్తిపతాకాన్ని ఎగురవేయాలి

నాకు భారతదేశం అంటే పిచ్చి. తెలుగు భాషంటే ఇంకా ఇష్టం. తెలుగు దర్శకుడిగా హాలీవుడ్‌లో మంచిపేరు గడించాలి. మన తెలుగు పరిశ్రమలో ఎంతోమంది నన్ను ప్రోత్సహిస్తున్నారు. ప్రజలందరూ నా చిత్రాలను ఆదరించాలి. తెలుగు దర్శకుడిగా హాలివుడ్‌లో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలన్నదే నా జీవితాశయం. 

Updated Date - 2020-02-16T08:29:11+05:30 IST