శిథిల గృహాల్లో నివసించొద్దు

ABN , First Publish Date - 2020-10-25T10:34:17+05:30 IST

శిథిలావస్థలో ఉన్న గృహాల్లో ప్రజలు నివసించకూడదని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి సూచించారు.

శిథిల గృహాల్లో నివసించొద్దు

జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి


కొత్తూరు, అక్టోబర్‌ 24: శిథిలావస్థలో ఉన్న గృహాల్లో ప్రజలు నివసించకూడదని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. మండలంలోని కుంచంగి గ్రామంలో ఇటీవల కూలిపోయిన నివాస గృహాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే ఇటువంటి ఇళ్లను గుర్తించామని, ఇంతలో వర్షాలు పడడంతో ఇక్కడ ఇల్లు కూలిపోయిందని చెప్పారు. కూలిపోయే దశలో ఉన్న ఇళ్లల్లో ఎవరూ నివాసం ఉండకుండా రెవెన్యూ సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కూలిపోయిన గృహాన్ని మరలా నిర్మించుకునేందుకు ప్రభుత్వం నుంచి సహాయం అందజేస్తామని జేసీ భరోసా ఇచ్చారు. అనంతరం  గ్రామ సచివాలయాన్ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అలాగే అక్కడే రైతుభరోసా కేంద్రాన్ని పరిశీలించారు. ఆర్బీకే భవనం తక్షణమే మరమ్మతులు చేపట్టి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సిబ్బందికి ఆయన సూచించారు. అంతకుముందు పట్టణంలోని ఆర్‌ఏఆర్‌ఎస్‌లో మెడికల్‌ కాలేజీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం నూకాంబిక అమ్మవారిని జేసీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ శ్రీనివాసరావు, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఈవోపీఆర్డీ ఆంజేయులు, పంచాయతీ కార్యదర్శి గాయత్రి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T10:34:17+05:30 IST