పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి : జేసీ

ABN , First Publish Date - 2020-03-12T07:34:28+05:30 IST

ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు నిర్వహించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అన్నారు. పదోతరగతి పరీక్షల నిర్వాహణపై బుధవారం ఆయన కలెక్టరేట్‌ కార్యాలయంలో వివిధ

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి : జేసీ

విశాఖపట్నం, మార్చి 11: ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు నిర్వహించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అన్నారు. పదోతరగతి పరీక్షల నిర్వాహణపై బుధవారం ఆయన కలెక్టరేట్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పదోతరగతి పరీక్షలు ఈనెల 31 నుంచి వచ్చేనెల 17వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 1026  పాఠశాలలకు చెందిన 56,796 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, 615 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు.


251 పరీక్ష కేంద్రాల్లో వీరు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్‌ విధించాలని తహసీల్దార్లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద జెరాక్స్‌ షాపులను మూసివేయించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద, స్ట్రాంగ్‌రూంలవద్ద, స్పాట్‌వాల్యుయేషన్‌ కేంద్రాల వద్ద అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా జరిగేలా చూడాలని ఏపీఈపీడీసీఎల్‌ అధికారులను కోరారు. ఆయా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని, పరీక్ష పత్రాల రవాణా సందర్భంగా సాయుధ బలగాలను నియమించాలని పోలీస్‌ అధికారులను కోరారు.


పరీక్ష కేంద్రాల వద్ద అత్యవసర వైద్యసేవలను అందించడానికి సిబ్బందితోపాటు మొబైల్‌వ్యాన్‌ను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేలా ఆయా రూట్లలో తగినన్ని బస్సులు నడపాలని పీటీడీ అధికారులను కోరారు. పరీక్ష కేంద్రాలవద్ద, స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాల వద్ద తాగునీరు, ఫర్నిచర్‌ ఏర్పాటు చేయాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వరరెడ్డి, రెవెన్యూ, పోలీస్‌, జీవీఎంసీ, ఏపీఈపీడీసీఎల్‌, పోస్టల్‌, వైద్యఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2020-03-12T07:34:28+05:30 IST