ఐటీడీఏ పీవో ఫైర్
ABN , First Publish Date - 2020-11-13T06:05:29+05:30 IST
విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకుగాను లోతుగెడ్డ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ చార్జిమెమో జారీచేశారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలు
లోతుగెడ్డ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంకు చార్జిమెమో
టీచర్లతోపాటు కోరుకొండ పీహెచ్‌సీ వైద్యుడు,
వీఆర్వో, చింతపల్లి ఆర్‌ఐలకు షోకాజ్
చింతపల్లి,నవంబరు 12: విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకుగాను లోతుగెడ్డ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ చార్జిమెమో జారీచేశారు. పాఠశాల ఉపాధ్యాయులతోపాటు కోరుకొండ పీహెచ్‌సీ వైద్యాధికారి, వీఆర్‌వో, చింతపల్లి ఆర్‌ఐలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. గురువారం ఆయన మండలంలోని లోతుగెడ్డ, కోరుకొండ గ్రామాలను సందర్శించారు. లోతుగెడ్డ ఆశ్రమ పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించి, తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ హెచ్‌ఎం రాజంనాయుడుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనకు చార్జిమెమో, పాఠశాల ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. అలాగే కోరుకొండ పీహెచ్‌సీని మూడు గంటలకే మూసివేయడంతో వైద్యాధికారి ఎస్.సంతోశ్‌కుమార్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. కోరుకొండతోపాటు చెరువూరులో పలువురు గిరిజనులు...రెవెన్యూ అధికారుల తీరుపై ఫిర్యాదు చేశారు. సాగు భూములను సర్వే చేయడానికి ఎవరూ రాలేదని, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను ఇంతవరకు పంపిణీ చేయలేదని పీవోకు చెప్పారు. దీంతో స్థానిక వీఆర్‌వో చిరంజీవి, చింతపల్లి ఆర్‌ఐ బాలదొరలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా పీవో వెంకటేశ్వర్ మాట్లాడుతూ, ఉద్యోగులు సమయపాలన పాటించాలని, పాఠశాలల్లో నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబ్ల్యూవో డీఈఈ డీవీఆర్‌ఎం రాజు, ఏఈ రఘురామ్ నాయుడు పాల్గొన్నారు.