జి.మాడుగుల తహసీల్దార్‌పై ఐటీడీఏ పీవో ఆగ్రహం

ABN , First Publish Date - 2020-12-18T05:09:51+05:30 IST

సమయపాలన పాటించడం లేదంటూ జి.మాడుగుల తహసీల్దార్‌కు పాడేరు ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ షోకాజ్‌ నోటీస్‌ జారీచేశారు.

జి.మాడుగుల తహసీల్దార్‌పై ఐటీడీఏ పీవో ఆగ్రహం
గిరిభూమి వెబ్‌సైట్‌లో నమోదును పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో డాక్టర్‌ వెంకటేశ్వర్‌

మధ్యాహ్నం 12 గంటలకు కార్యాలయం తనిఖీ

విధులకు హాజరుకాని మండల రెవెన్యూ అధికారి

తీరు మార్చుకోలేదంటూ షోకాజ్‌ నోటీసు జారీ

300 మంది వలంటీర్లకు 10 మంది మాత్రమే

విధులకు హాజరు కావడంపై అసంతృప్తి 


పాడేరు రూరల్‌, డిసెంబరు 17: సమయపాలన పాటించడం లేదంటూ జి.మాడుగుల తహసీల్దార్‌కు పాడేరు ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ షోకాజ్‌ నోటీస్‌ జారీచేశారు. ఆయన గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. తహసీల్దార్‌ చిరంజీవిపడాల్‌ విధులకు హాజరు కాలేదని తెలుసుకుని తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. అటవీ హక్కు పత్రాలు (ఆర్‌వోఆర్‌ఎఫ్‌) పొందిన లబ్ధిదారుల వివరాలు, గిరిభూమి వెబ్‌సైట్‌లో నమోదు ప్రక్రియను పరిశీలించారు. మండలంలో 300 మంది గ్రామ వలంటీర్‌లు వుండగా వీరిలో 10 మంది మాత్రమే విధులకు హాజరుకావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఇప్పటికి మూడుసార్లు సందర్శించినా...తహసీల్దార్‌ తీరు మారలేదంటూ షోకాజ్‌ నోటీస్‌ను జారీ చేశారు. 17వ తేదీ సాయంత్రానికి గిరిభూమి వెబ్‌సైట్‌లో నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. కాగా పీవో కార్యాలయంలో వుండగానే తహసీల్దార్‌ చిరంజీవిపడాల్‌ వచ్చారు. దీంతో ఆయన మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-18T05:09:51+05:30 IST