భూ ఆక్రమణలపై విచారణ వేగవంతం

ABN , First Publish Date - 2020-02-16T08:36:15+05:30 IST

భూ ఆక్రమణలపై విచారణ వేగవంతం

భూ ఆక్రమణలపై విచారణ వేగవంతం

  • మరో వెయ్యి ఫిర్యాదులను విచారించాల్సి ఉంది    
  • సిట్‌ చీఫ్‌ డాక్టర్‌ విజయకుమార్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): విశాఖ పరిసరాల్లోని భూఆక్రమణలపై విచారణను వేగవంతం చేస్తామని సిట్‌ చీఫ్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రారంభంలో కొంతమేర విచారణ నెమ్మదిగా సాగిందని, అయితే ఫిర్యాదులను పరిశీలించి  అంశాల వారీగా విభజించడంతో అంతా కొలిక్కి వచ్చిందన్నారు. విచారణలో జిల్లా కలెక్టర్‌, ఇతర యంత్రాంగం సహకారం అందిస్తున్నారన్నారు. గత ఏడాది నవంబరు నుంచి సిట్‌ విఽధులు చేపట్టినప్పటి నుంచి జనవరి వరకు విచారణ మేరకు ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందజేశామన్నారు. గత నెలాఖరుతో సిట్‌ గడువు ముగియడంతో మరో మూడు నెలలు ప్రభుత్వం పెంచిందన్నారు. ఈ మూడు నెలల్లో విచారణను పూర్తి చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. 

సిట్‌కు 1,400 ఫిర్యాదులు రాగా, వీటిలో 400 ఫిర్యాదులు విచారించిన అంశాలను మధ్యంతర నివేదికలో పొందుపరిచామన్నారు. ఎన్‌వోసీల జారీ, ఆక్రమణలు, కబ్జా, భూకేటాయింపులు, భూముల ఛేంజ్‌ ఆఫ్‌ క్లాసిఫికేషన్‌ వంటి అంశాలపై విచారించినప్పుడు పలు ఉల్లంఘనలు జరిగాయన్నారు. భూకేటాయింపులు, ఎన్‌వోసీల జారీ వంటి అంశాల్లో పలువురి అధికారుల పాత్ర ఉన్నట్టు గుర్తించామన్నారు. కాగా మిగిలిన 1000 దరఖాస్తులలో 400 వరకు ఆక్రమణలు, కబ్జాకు సంబంఽధించివేనన్నారు. తమ విచారణలో పాత సిట్‌ నివేదికను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడే వ్యక్తుల కోసం ఫొరెన్సిక్‌ పరీక్షలు ద్వారా విచారణ చేపడుతున్నామన్నారు. అయితే డిజిటల్‌ లావాదేవీలు విషయంలో ఫొరెన్సిక్‌ పరీక్షల ద్వారా ఫలితం రాదని, అదే రికార్డులను చేతితో ట్యాంపర్‌ చేసినట్టయితే కనుగొనవచ్చునన్నారు. భూ సమీకరణపై దర్యాప్తు చేయడం లేదని ఒక ప్రశ్నకు బదులుగా విజయ్‌కుమార్‌ చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన అంశాలపై మాత్రమే సిట్‌ విచారణ చేస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో సిట్‌ సభ్యులు వైవీ అనురాధ, పి.భాస్కరరావు, కలెక్టర్‌ వినయ్‌చంద్‌, జీవీఎంసీ,  వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ కమిషనర్లు కోటేశ్వరరావు, సృజన, సీపీ ఆర్కేమీనా, కొత్త సభ్యులు దుర్గానంద ప్రసాదరావు, రాహుల్‌పాండే, డీసీపీ రంగారెడ్డి, జిల్లా అటవీ అధికారి సెల్వం, డీఆర్‌వో శ్రీదేవి, సిట్‌ డిప్యూటీ కలెక్టర్‌ శేషశైలజ పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-16T08:36:15+05:30 IST