డిపోల్లో చెల్లని కందిపప్పు

ABN , First Publish Date - 2020-12-19T06:22:54+05:30 IST

రేషన్‌ డిపోల్లో కందిపప్పు కొనుగోలుకు ఈ నెల తెల్లకార్డుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ధరను పెంచడమే ఇందుకు కారణం. ఈ ఏడాది మార్చి వరకు కిలో రూ.40కు డిపోల్లో విక్రయించేవారు.

డిపోల్లో చెల్లని కందిపప్పు


ధర పెంచడమే కారణం

గతంలో కిలో రూ.40...ఈ నెల నుంచి రూ.67

పంచదార నాణ్యతపైనా పెదవివిరుపు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రేషన్‌ డిపోల్లో కందిపప్పు కొనుగోలుకు ఈ నెల తెల్లకార్డుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ధరను పెంచడమే ఇందుకు కారణం. ఈ ఏడాది మార్చి వరకు కిలో రూ.40కు డిపోల్లో విక్రయించేవారు. కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు నెలకు రెండేసిసార్లు చొప్పున ఉచితంగా సరకులు అందజేసిన ప్రభుత్వం, డిసెంబరు వచ్చేసరికి కందిపప్పు ధరను రూ.27 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 12,51,000 మంది కార్డుదారుల కోసం ప్రతినెలా 1,250 టన్నుల కందిపప్పు కేటాయిస్తున్నారు. అయితే ధర పెరగడంతో కార్డుదారులంతా తీసుకోరని ముందుగానే గుర్తించిన డీలర్లు, ఈ నెలలో 5,14,357 కిలోలు (514 టన్నులు) మాత్రమే కొనుగోలు చేశారు. కాగా గత నెల వరకు డిపోల వద్ద 62,106 కిలోల కందిపప్పు స్టాకు ఉంది. పాతస్టాకు, తాజాగా కొనుగోలు చేసింది...మొత్తం 5,76,463 (46.08 శాతం) కిలోల కందిపప్పు మాత్రమే కార్డుదారులకు విక్రయించారు. అయితే ఇదంతా రికార్డుల్లో  మాత్రమే. వాస్తవంగా చాలాచోట్ల డీలర్ల వద్ద ఇంకా స్టాకు వుందనేది బహిరంగ రహస్యం. డీలర్లు ఆ స్టాకును నగరంలో హోటళ్లు, మెస్‌లకు విక్రయించే పనిలో పడ్డారు. కాగా పంచదార కొనుగోలుకు కూడా కార్డుదారులు ఆసక్తి చూపడం లేదు. ప్రతి కార్డుకు అరకిలో పంచదార రూ.17కు అందజేస్తారు. ఈ పంచదారలో నాణ్యత లేకపోవడం, బహిరంగ మార్కెట్‌లో మంచిది లభించడంతో కార్డుదారులు డిపోల్లో కొనుగోలుకు విముఖత చూపుతున్నారు. అయితే డీలర్లు  ఒత్తిడి చేయడంతో ఇష్టంలేకపోయినా కొనుగోలు చేస్తున్నారు. ఈ నెలలో పౌర సరఫరాల శాఖ నుంచి డీలర్లు 5,48,591 కిలోలు పంచదార కొనుగోలుచేశారు. పాత స్టాకు 3,529 కిలోలు పంచదార ఉండిపోయింది. ఈ రెండు కలిపి ఈ నెలలో 5,52,120 కిలోల పంచదార విక్రయించారు. వాస్తవంగా ప్రతి కార్డుకు అరకిలో పంచదార వంతున ఆరున్నర వేల టన్నుల పంచదార విక్రయుంచాలి. ఇక ఈ నెలలో బియ్యం 88.38 శాతం మంది కార్డుదారులు కిలో రూపాయి వంతున 1,82,35,178 కిలోల బియ్యం కొనుగోలు చేశారు. 

Read more