నవరత్నాలతో సమగ్రాభివృద్ధి

ABN , First Publish Date - 2020-08-16T14:05:51+05:30 IST

జిల్లాలో మౌలిక వసతులు, సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కల్పనకు..

నవరత్నాలతో సమగ్రాభివృద్ధి

మౌలిక వసతులు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కల్పనక్చు పెద్దపీట 

స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

రూ.2022 కోట్లతో ‘సుజల స్రవంతి’ తొలిదశ పనులు

ఖరీఫ్‌లో రూ.3,497 కోట్ల రుణాలు

జిల్లాలో 2.98 లక్షల పేదలకు త్వరలో పట్టాలు

వైఎస్సార్‌ ఆసరా కింద డ్వాక్రా గ్రూపుల రుణాలు మాఫీ చేస్తాం

నాడు-నేడు కింద రూ.300 కోట్లతో పాఠశాలల అభివృద్ధి

కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు

పారిశ్రామిక రంగంలో గత ఏడాది రూ.651 కోట్ల పెట్టుబడులు

రానున్న రోజుల్లో మరో రూ.72,914.09 కోట్లు


విశాఖపట్నం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మౌలిక వసతులు, సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ, సామాజిక, ఆర్థిక స్వావలంబన కోసం నవరత్నాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి  మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, విద్య, ఆరోగ్య, సామాజిక స్థితిగతులు మెరుగు కోసం  తొమ్మిది పథకాలు అమలు చేస్తున్నామన్నారు.


రూ.2,022.22 కోట్లతో సుజల స్రవంతి తొలిదశ

బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా జిల్లాలో 3.25 లక్షల ఎకరాల ఆయుకట్టును సాగులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. తొలి దశలో రూ.2,022.22 కోట్లతో 1.3 లక్షల ఎకరాలకు నీరందించే పనులు పురోగతిలో వున్నట్టు తెలిపారు. ఇక వైఎస్సార్‌ రైతు భరోసా కింద 2020-21 సంవత్సరంలో 3.48 లక్షల మందికి మొదటి విడతగా రూ.194.42 కోట్ల సాయం అందించామన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రూ.3,497 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 3,67,115 మంది రైతులకు రూ.1,639 కోట్లు మంజూరు చేశామన్నారు. 


సంక్షేమానికి పెద్దపీట

జగనన్న విద్యా దీవెన ద్వారా 1.43 లక్షల మంది విద్యార్థులకు రెండేళ్లలో రూ.324 కోట్లు చెల్లించినట్టు మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. అమ్మఒడి పథకం కింద 3.92 లక్షల విద్యార్థుల తల్లులకు రూ.15 వేలు వంతున రూ.587.73 కోట్లు జమ చేశామన్నారు. వైఎస్సార్‌ ఆసరా కింద 70,082 డ్వాక్రా గ్రూపులకు బ్యాంకులలో వున్న రూ.1,797.95 కోట్ల రుణాలను వచ్చే నెల నుంచి నాలుగు వాయిదాల్లో మాఫీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 2,98,178 మంది అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఇటీవల వైఎస్సార్‌ చేయూత కింద 1.94 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.360 కోట్లు జమ చేశామన్నారు. ఇంకా వైఎస్సార్‌ నవశకం కింద మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, వాహనమిత్ర, వసతి దీవెన, కాపు నేస్తం, చేదోడు వంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. స్వయంశక్తి సంఘాలకు రూ.918.59 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని గత నెల వరకు 11,972 సంఘాలకు రూ.187.1 కోట్లు మంజూరు చేశామన్నారు. 


పాడేరు ఐటీడీఎ పరిధిలో ప్రస్తుత సంవత్సరం 12 వేల ఎకరాల్లో కాఫీ తోటలు పెంచి 11,488 మంది రైతులకు ప్రయోజనం కల్పించామన్నారు. 33,255 మంది గిరిజన రైతులకు 57,564.40 ఎకరాలకు అటవీ హక్కుల పత్రాలు పంపిణీ చేయనున్నామన్నారు. మన్యంలో కనీస రహదారి లేని గ్రామాలకు రూ.500 కోట్లతో రహదారుల నిర్మాణం పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. నాడు-నేడు కింద జిల్లాలో 1,149 పాఠశాలల్లో రూ.300 కోట్లతో మౌలిక వసతులు కల్పించే పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. 


పరిశ్రమలు-ఉపాధి

గత ఆర్థిక సంవత్సరంలో రూ.651 కోట్ల పెట్టుబడితో పిడిలైట్‌, హైటెక్‌ కార్పొరేషన్‌, రక్షిత డ్రగ్స్‌, పోరన్‌ ల్యాబ్స్‌ వంటి పరిశ్రమలు వచ్చాయని, 1,228 మందికి ఉపాధి లభించిందని మంత్రి ముత్తంశెట్టి పేర్కొన్నారు. ఇంకా సెయింట్‌గోబిన్‌, నేరోలాక్‌ పెయింట్స్‌, సోలార్‌ యాక్టివ్‌ ఫార్మా, తదితర 55 పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని, రూ.72,914.09 కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు. మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అభివృద్ధిలో భాగంగా రూ.125.91 కోట్లతో 832 పనులు చేపట్టగా 379 పూర్తయ్యాయన్నారు. నేచురల్‌ హిస్టరీ పార్కు, కైలాసగిరి వద్ద ప్లానిటోరియం, కైలాసగిరి అభివృద్ధి వంటి పనులు చురుగ్గా సాగుతున్నాయని పేర్కొన్నారు. పూడిమడకలో రూ.360 కోట్ల అంచనాతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. నగరంలో ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణకు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. కరోనా వైరస్‌ అదుపునకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 23,356 మంది వైరస్‌ బారినపడగా 16,746 మంది కోలుకోగా, 6,448 మంది చికిత్స పొందుతున్నారన్నారు.


అయితే 162 మంది మరణించడం బాధాకరమైన విషయమన్నారు. జిల్లా అభివృద్ధికి సహకరించిన ప్రజాప్రతినిధులు, వివిఽధ శాఖల అధికారులు, శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడుతున్న పోలీసులకు మంత్రి ముత్తంశెట్టి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా, జీవీఎంసీ కమిషనర్‌ సృజన, జేసీలు వేణుగోపాల్‌రెడ్డి, అరుణ్‌బాబు, గోవిందరావు, ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు, సిటీ డీసీపీ ఐశ్వర్య రస్తోగి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2020-08-16T14:05:51+05:30 IST