మావోయిస్టుల కీలక సమాచారం లభ్యం : ఏఎస్‌పీ

ABN , First Publish Date - 2020-07-28T10:06:59+05:30 IST

ఏవోబీ సరిహద్దు చింతపల్లి మండలం దిగజనబ వాగు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించి కీలక సమాచారం, ఆయుధాలు ..

మావోయిస్టుల కీలక సమాచారం లభ్యం : ఏఎస్‌పీ

చింతపల్లి: ఏవోబీ సరిహద్దు చింతపల్లి మండలం దిగజనబ వాగు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించి కీలక సమాచారం, ఆయుధాలు లభ్యమయ్యాయని, తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఏఎస్పీ వి.విద్యాసాగర్‌ నాయుడు తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. ఈనెల 25 సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఎగజనబవాగు ప్రాంతం వద్ద కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో ఎన్‌కౌంటర్‌ జరిగిన సంగతి తెలిసిందేనని అన్నారు.


మరుసటి రోజు సంఘటన స్థలాన్ని పరిశీలించగా మావోయిస్టు మృతదేహంతోపాటూ రెండు కిట్‌బ్యాగ్‌లు, పాయింట్‌ 303, పిస్టల్‌, విప్లవసాహిత్యం, పార్టీ కీలక సమాచారం, మావోయిస్టు సమావేశానికి హాజరైన వ్యక్తుల జాబితా లభించిందన్నారు. మృతుడు జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామానికి చెందిన పాంగి దయ అలియాస్‌ పేతురుగా గుర్తించామన్నారు.  ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు తప్పించుకున్నారని, కొంత మంది గాయపడి ఉంటారన్నారు. తప్పించుకున్న అగ్రనేతల కోసం ప్రత్యేక బలగాలతో గాలింపు కొనసాగిస్తున్నామన్నారు.  


మావోయిస్టులు లొంగిపోతే పునరావాసం 

చింతపల్లి: మావోయిస్టులు లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు తెలిపారు. మావోయిస్టులు అర్థరహిత ఉద్యమం పేరిట ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. మావోయిస్టులు స్వదేశీయులేనని, స్వచ్ఛందంగా లొంగిపోతే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు, సహకారం అందించి పునరావాసం కల్పిస్తామన్నారు. గాయపడిన వారు లొంగిపోతే వైద్యం చేయిస్తామన్నారు. జనజీవన స్రవంతిలో కలవకుండా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2020-07-28T10:06:59+05:30 IST