రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2020-12-29T05:23:21+05:30 IST

ప్రపంచ పరిశుభ్ర బీచ్‌ల జాబితాలో ఏపీ నుంచి రుషికొండ బీచ్‌ ఎంపికవ్వడం పట్ల రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు.

రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్‌ ఆవిష్కరణ
రుషికొండ బీచ్‌లో బ్లూ ఫాగ్‌ను ఆవిష్కరించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ఎర్రమట్టిదిబ్బలతో పాటు ఇతర బీచ్‌లను అభివృద్ధి చేయండి

కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు మంత్రి ముత్తంశెట్టి విజ్ఞప్తి

సాగర్‌నగర్‌, డిసెంబరు 28: ప్రపంచ పరిశుభ్ర బీచ్‌ల జాబితాలో ఏపీ నుంచి రుషికొండ బీచ్‌ ఎంపికవ్వడం పట్ల రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశంలో ఎంపికైన ఎనిమిది బీచ్‌లలో బ్లూ ఫ్లాగ్‌ల ఆవిష్కరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా రుషికొండ బీచ్‌ వద్ద మంత్రి ముత్తంశెట్టి బ్లూ ఫ్లాగ్‌ (నీలం జెండా)ను ఆవిష్కరించి మాట్లాడారు. పర్యావరణ విద్య, సమాచారం, స్నానం చేసే నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ, పరిరక్షణ, బీచ్‌లలో భద్రఆ సేవలు వంటి 33 అంశాలను పరిశీలించి బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లను ఎంపిక చేస్తారన్నారు. బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు వల్ల అంతర్జాతీయ పర్యాటకులు వస్తారని పేర్కొన్నారు. విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలతో పాటు రాష్ట్రంలోని మిగిలిన తొమ్మిది బీచ్‌లను కూడా అభివృద్ధి చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని ముత్తంశెట్టి కోరారు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధికి సీఎం జగన్‌ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం అథారిటీ సీఈవో ప్రవీణ్‌కుమార్‌, కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌, పర్యాటకశాఖ అధికారులు, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-29T05:23:21+05:30 IST