-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » iipe varsity work starts
-
ఎట్టకేలకు ఐఐపీఈ వర్సిటీ పనులు ప్రారంభం
ABN , First Publish Date - 2020-11-22T04:11:17+05:30 IST
ఎట్టకేలకు మండలంలోని వంగలిలో ఐఐపీఈ(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ) వర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గత రెండు రోజులుగా వర్సిటీ ప్రహరీ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి.

సబ్బవరం, నవంబరు 21 : ఎట్టకేలకు మండలంలోని వంగలిలో ఐఐపీఈ(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ) వర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గత రెండు రోజులుగా వర్సిటీ ప్రహరీ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. సుమారు 200 ఎకరాల స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. గతంలో వర్సిటీ నిర్మాణానికి రెవెన్యూ అధికారులు వంగలి రెవెన్యూ పరిధిలో 200 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించారు. డీ పట్టా రైతులు, ఆక్రమణదారులకు అప్పట్లోనే రూ.15 కోట్లు పరిహారం చెల్లించారు. ఐఐపీఈ నిర్మాణ పనులకు 2016 అక్టోబరు 20న శంకుస్థాపన చేశారు. వర్సిటీ నిర్మాణానికి భూములు ఇచ్చిన 143 మంది రైతుల్లో 31 మంది రైతులు పరిహారం చాలదంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వర్సిటీ నిర్మాణానికి కేంద్రం విడుదల చేసిన రూ.600 కోట్లు వెనక్కి వెళ్లిపోయాయి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్, రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని వర్సిటీ ప్రాముఖ్యతను రైతులకు వివరించి నచ్చజెప్పడంతో వారు కోర్టు కేసును ఉపసంహరించుకునేందుకు ముందుకు వచ్చారు. ప్రహరీ నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ముందుగా వర్సిటీ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. దీంతో శుక్రవారం నుంచి ప్రహరీ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.