-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Hundreds of hearings asking for cancellation of exams
-
డిగ్రీ, పీజీ పరీక్షలపై డైలమా
ABN , First Publish Date - 2020-06-22T09:48:23+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినా డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై డైలమా కొనసాగుతోంది.

రద్దుపై ప్రభుత్వం తర్జనభర్జన
సర్కారు నిర్ణయం కోసం విద్యార్థులు ఎదురుచూపులు
26 తేదీ నాటికి స్పష్టత వచ్చే అవకాశం
ఏయూ పరిధిలో 1.7 లక్షల మంది విద్యార్థులు
పరీక్షలు రద్దు కోరుతూ వందలాది వినతులు
పరీక్షలు నిర్వహిస్తే ఇతర ప్రాంతాల విద్యార్థులకు ఇబ్బందులు
ఇతర రాష్ట్రాల విద్యార్థులకు క్వారంటైన్ కష్టాలు
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినా డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై డైలమా కొనసాగుతోంది. కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని 300కుపైగా డిగ్రీ, పీజీ కళాశాలలు ఉన్నాయి. ఆయా కాలేజీల్లో సుమారు లక్షా 70 వేల మంది పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. పరీక్షలు నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే అధికారులు విడుదల చేశారు. జూలై నెలలో పరీక్షలు జరుగుతాయన్న ఉద్దేశంతో విద్యార్థులు ప్రిపరేషన్ సాగిస్తున్నారు. అయితే, కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న చర్చ సర్వత్రా సాగుతోంది. పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ వందలాది వినతులు వస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఇంటర్, పది విద్యార్థులు మాదిరిగానే ప్రమోట్ చేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే, దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఈ నెల 26 నాటికి స్పష్టత వచ్చే అవకాశముందని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.
ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా..
ఏయూ పరిధిలోని పలు కళాశాలల్లో సుమారు లక్షా 60 వేల మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ పరీక్షలు రాయాల్సి ఉంది. యూనివర్సిటీ పరిధిలో పలు కోర్సులు చదువుతున్న మరో ఆరు వేల మంది విద్యార్థులు కూడా ఉన్నారు. వీరిలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన వాళ్లతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. వీరంతా పరీక్షలు నిమిత్తం ఆయా ప్రాంతాల నుంచి నగరానికి రావడం కొంత ఇబ్బందితో కూడుకున్న వ్యవహారమే. దీనిని దృష్టిలో పెట్టుకుని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షలు రద్దు చేయాలని కోరుతున్నారు.
పరీక్షల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ చేసే అవకాశముందని వారంతా యూనివర్సిటీ అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. అదే సమయంలో బస్సుల్లో ప్రయాణాలకు పరిమితులు విధించిన నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.