జిల్లాలో 1,16,357 మందికి ఇళ్ల స్థల పట్టాలు

ABN , First Publish Date - 2020-12-16T05:05:14+05:30 IST

జిల్లాలో తొలివిడత 1,16,357 మందికి ఇళ్ల స్థల పట్టాలు అందించనున్నామని పర్యాటకశాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

జిల్లాలో 1,16,357 మందికి ఇళ్ల స్థల పట్టాలు
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి

25 నుంచి జనవరి 7 వరకు పంపిణీ 

సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా

ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన మంత్రి ముత్తంశెట్టి 

 

మహారాణిపేట, డిసెంబరు 15: జిల్లాలో తొలివిడత 1,16,357 మందికి ఇళ్ల స్థల పట్టాలు అందించనున్నామని పర్యాటకశాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఉండకూడదన్న లక్ష్యం మేరకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.  ఈ నెల 25 నుంచి జనవరి 7 వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రతి లేఅవుట్‌ వద్ద ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామని, లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తారన్నారు. పథకం అమల్లో లోపాలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. లే అవుట్‌లలో  సదుపాయాలు కల్పించాలన్నారు.


అనంతరం కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పంపిణీకి సుమారు 900 లే అవుట్లు సిద్ధం చేశామన్నారు. మొదటి విడత గ్రామీణ ప్రాంతాలలో 1,16,357 పట్టాలు, 26,438 టిడ్కో గృహాలు అందించనున్నట్టు వివరించారు. వీఎంఆర్‌డీఏ పరిధిలో 50 వేల గృహాలు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. జీవీఎంసీ పరిధిలోని ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌లో కోర్టు కేసుల మూలంగా పట్టాల పంపిణీకి బదులు ఇంటి స్థలం మంజూరు పత్రాన్ని అందిస్తామన్నారు. కోర్టు కేసులు తేలిన తరువాతే స్థలం కేటాయిస్తారన్నారు. ఈ మేరకు నియోజకవర్గం ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లతో సమావేశం ఏర్పాటు చేసి మార్గదర్శకాలు జారీచేస్తామన్నారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు అదీప్‌రాజ్‌, వాసుపల్లి గణేష్‌కుమార్‌, గుడివాడ అమర్‌నాథ్‌, తిప్పల నాగిరెడ్డి, కరణం థర్మశ్రీ, కన్నబాబురాజు, జేసీ వేణుగోపాలరెడ్డి, జీవీఎంసీ కమిషనర్‌ సృజన, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T05:05:14+05:30 IST