మహా బాదుడు

ABN , First Publish Date - 2020-11-25T06:41:45+05:30 IST

ఆస్తి పన్ను సవరణ ప్రతిపాదనకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల పరిధిలో నివాసం వుంటున్న వారిపై మోయలేని భారం పడనున్నది.

మహా బాదుడు

ఇకపై అద్దె ప్రాతిపదికన కాకుండా ఆస్తి మూల విలువను బట్టి పన్ను విధింపు

మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో అమలు

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం...గవర్నర్‌ ఆమోదం

ప్రజల నెత్తిన మోయలేని భారం

భూమి విలువ పెంచిన ప్రతిసారీ ఆస్తి పన్ను పెరుగుదల

వచ్చే ఆర్థిక సంవత్సర నుంచి అమలు

విశాఖ నగరవాసులపై రూ.100 కోట్లు భారం

కొత్తచట్టాన్ని ఉపసంహరించుకోవాలని విపక్షాల డిమాండ్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆస్తి పన్ను సవరణ ప్రతిపాదనకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల పరిధిలో నివాసం వుంటున్న వారిపై మోయలేని భారం పడనున్నది. రాష్ట్రంలోనే అతిపెద్ద స్థానిక సంస్థగా గుర్తింపుపొందిన గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)తో పాటు జిల్లాలోని నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను భారీ పెరగనున్నది. ఇప్పటివరకూ వార్షిక అద్దె విలువ (యాన్యువల్‌ రెంటల్‌ వాల్యూ) ప్రాతిపదికన విధిస్తున్న ఆస్తిపన్నును...ఇకపై మూల విలువ (రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించే ఆస్తి విలువ) ఆధారంగా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు కానున్న ఈ కొత్త చట్టం వల్ల విశాఖ నగరవాసులపై ఏడాదికి రూ.100 కోట్లు వరకూ భారం పడే అవకాశం వుందని జీవీఎంసీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సామాన్యులపై పెనుభారం మోపే ఈ కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని విపక్షాలతో పాటు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు డిమాండ్‌ చేస్తున్నాయి. 


జీవీఎంసీ పరిధిలో నివాస, వాణిజ్య కేటగిరీలకు సంబంధించి ఐదు లక్షలకుపైగా అసెస్‌మెంట్లు ఉన్నాయి. వాటి నుంచి ఏటా రూ.380 కోట్లు ఆస్తి పన్ను రావాల్సి వుండగా, రూ.330 కోట్లు వరకూ వసూలవుతోంది. ఆస్తి పన్ను ఎంత కట్టాలనేది ప్రస్తుతం జీవీఎంసీ అద్దె ప్రాతిపదికన నిర్ణయిస్తుంది. అంటే ఒక నివాస లేదా వాణిజ్య భవనం ఎన్ని చదరపు గజాలు లేదా చదరపు అడుగుల్లో వుందీ ముందుగా జీవీఎంసీ రెవెన్యూ విభాగం కొలతలు వేస్తుంది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎంత అద్దె వుందనేది పరిగణనలోకి తీసుకుని, అందులో కొన్నిరకాల మినహాయింపులు పోగా మిగిలిన మొత్తంలో 33 శాతాన్ని ఆస్తి పన్నుగా విధిస్తుంది. ఒకసారి అసెస్‌మెంట్‌ జారీ అయిన తర్వాత అవే కొలతలు శాశ్వతంగా కొనసాగుతాయి. ఎప్పుడైనా జీవీఎంసీ ఆస్తిపన్ను పెంచాలనుకుంటే తిరిగి పెరిగిన అద్దెలను ప్రాతిపదికగా తీసుకుని పన్ను మదింపు చేస్తుంది. చివరిసారిగా 2009లో ఆస్తిపన్ను పెంచారు. తాజాగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఆస్తిపన్ను పెంపు అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈసారి అద్దె ప్రాతిపదికన కాకుండా ఆస్తి మూల విలువను బట్టి పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సుమారు 100 గజాల స్థలంలో వ్యక్తిగత భవనం వుంటే సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఆ ప్రాంతంలో గజం ధర ఎంతవుందనేది పరిగణనలోకి తీసుకుని, దానిని బట్టి పన్ను విధించనున్నారు. ఉదాహరణకు ఎంవీపీ కాలనీలో గజం ధర రూ.60 వేలు ఉంది. అక్కడ వంద గజాల్లో ఇల్లు వుంటే రూ.60 లక్షలు. అందులో ఎంత శాతం పన్నుగా చెల్లించాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అదే అపార్టుమెంట్‌లో ఫ్లాట్‌ అయితే అక్కడి మార్కెట్‌ ధరను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే 375 చదరపు గజాల విస్తీర్ణం కంటే తక్కువ ఇళ్లలో యజమానులే నివాసం వుంటే వారికి ఆస్తిపన్ను రూ.50గా వసూలు చేస్తారు. అలాగే మాజీ సైనికులు, వితంతువులు, సైన్యంలో పనిచేస్తున్న వారికి మినహాయింపులు ఉంటాయి.


ఒకేసారి రూ.100 కోట్లు భారం

ఆస్తిపన్ను విధింపులో సంస్కరణలను అమలు చేస్తే నగర ప్రజలపై ఒకేసారి రూ.100 కోట్లు భారం పడే  అవకాశం వుందని అఽధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రూ.330 కోట్లు ఆస్తిపన్ను వసూలవుతుండగా, ఆస్తి విలువ ఆధారంగా అయితే 30 శాతం పెరిగి రూ.430 కోట్లు వసూలయ్యే అవకాశం వుంటుందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఏటా ఆగస్టులో ఆస్తి విలువలు పెరుగుతుండడంతో ఆ మేరకు పన్ను కూడా పెరిగే అవకాశం ఉండడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై జీవీఎంసీ అధికారుల వద్ద ప్రస్తావించగా దీనికి సంబంధించిన నిర్దిష్టమైన విధివిధానాలు అందాల్సి ఉందని తెలిపారు.

Read more