-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » hike in oil and dal prices
-
ధరాభారం
ABN , First Publish Date - 2020-12-27T06:30:38+05:30 IST
కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయి కొందరు, సగం జీతాలు అందుకుంటూ మరికొందరు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో పెరుగుతున్న ధరలు సామాన్యులకు మరింత భారంగా పరిణమించాయి.

ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరకుల ధరలు
ఐదారు నెలల క్రితంతో పోల్చితే ఒక్కో కుటుంబంపై రూ.500 నుంచి రూ.1500 అదనపు భారం
బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు
కరోనాతో ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా పప్పులు, వంట నూనెల రేట్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆరేడు నెలల క్రితంతో పోల్చితే ప్రస్తుతం ఒక్కో కుటుంబంపై కనిష్ఠంగా రూ.500 నుంచి రూ.1500 వరకు అదనపు భారం పడుతోందంటే ధరల పెరుగుదల ఏ స్థాయిలో వున్నదో అర్థం చేసుకోవచ్చు.
కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయి కొందరు, సగం జీతాలు అందుకుంటూ మరికొందరు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో పెరుగుతున్న ధరలు సామాన్యులకు మరింత భారంగా పరిణమించాయి. గతంలో నాలుగు వేల రూపాయలు తీసుకుని మార్కెట్‌కు వెళితే...నెలకు సరిపడా వంటింటి సరకులు వచ్చేవని, ఇప్పుడు అంతే మొత్తానికి 20 రోజులకు కూడా రావడం లేదని నగరంలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన రామలక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. నిత్యావసర సరకుల ధరలను నియంత్రించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరించడం వల్ల తమలాంటి సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందని వెంకోజీపాలెం ప్రాంతానికి చెందిన రాజేశ్వరి వాపోయారు. పెరిగిన ధరలతో మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయమేస్తోందని, ప్రతినెలా వంట నూనె, పప్పుల రేట్లు పరుగులు పెడుతున్నాయని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి లక్షణరావు ఆవేదన వ్యక్తంచేశాడు.
పెను భారం
ఏడాది కాలంలో రోజువారీ వినియోగించే ప్రతి సరకు ధర కనీసం రూ.10 నుంచి రూ.40 వరకు పెరిగింది. గత ఏడాది డిసెంబరు నెలలో కిలో కందిపప్పు రూ.90 వుండగా, ప్రస్తుతం రూ.110కు చేరింది. అలాగే ఈ ఏడాది మార్చిలో రూ.65 రూపాయలు వున్న కిలో శనగపప్పు ప్రస్తుతం రూ.90కు విక్రయిస్తున్నారు. వంట నూనెల ధరలైతే వినియోగదారుడికి మంటనే పుట్టిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకూ ధర పెరిగింది. ఇక...బియ్యం (25 కిలోల బ్యాగ్) ధరలు బ్రాండ్‌ను బట్టి గత ఏడాది కాలంలో రూ.50 నుంచి రూ.150 వరకు పెరిగాయి. ధరలు పెరిగాయని కొనుగోలు చేయకుండా ఉండలేమని...అప్పో, సప్పో చేసి తెచ్చుకోక తప్పడం లేదని ఇసుకతోటకు చెందిన ఓ కూలీ ఆవేదన వ్యక్తం చేశాడు.
పెరిగిన ధరలతో సరకులు కొనలేని పరిస్థితి
- పి.సంధ్య, గృహిణి, మధురవాడ
మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఏడాది కిందట రూ.500 లోపు ఉన్న ఐదు లీటర్ల ఆయిల్ టిన్ ఇప్పుడు రూ.600 దాటింది. పప్పులు, ఇతర నిత్యావసర సరకుల ధరలు అంతేస్థాయిలో పెరిగిపోయాయి. గతంలో వారానికి మూడుసార్లు పప్పు వండుకుని తినేవాళ్లం..పెరిగిన ధరలతో ఒక్కసారికే పరిమితం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ధరలు ఇలానే పెరుగుతూ పోతే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కష్టంగానే ఉంటుంది. ప్రభుత్వాలు ధరల నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తే బాగుంటుంది.
పెరిగిన నిత్యవసర ధరలతో భారం
పిట్ల శ్రీనివాసరావు, నర్సీపట్నం
వంట నూనె, పప్పులు, బియ్యం వంటి నిత్యావసర సరకులు ధరలు పెరిగిపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. మే నెలలో కిలో కందిపప్పు ధర రూ.110 వుంటే ఇప్పుడు రూ.123కు పెరిగింది. వంట నూనె రూ.105 నుంచి రూ.125కి పెరిగింది. ఐదారు నెలలగా నెలవారీ పట్టీ చూసుకుంటే ధరల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కరోనాతో ఆర్థిక ఇబ్బందుల్లో వున్న పేద, మధ్య తరగతకి ధరల పెరుగుదల మోయలేని భారమే.
ధరల పట్టిక
సరకు ప్రస్తుత ధర మొన్న మార్చిలో
కందిపప్పు 110 80
శనగపప్పు 90 65
మినపపప్పు 120 100
పెసరపప్పు 100 85
గోధుమపిండి 45 30
బెల్లం 60 45
పంచదార 43 39
చింతపండు 120 95
కారం 250 235
మైదాపిండి 40 30
ఆయిల్స్..
ఫ్రీడమ్ రిఫైనరీ 135 98
సూపర్ డ్రాప్ 130 96
పామాయిల్ 110 82
వేరుశనగ నూనె 165 130