మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ నిరసన

ABN , First Publish Date - 2020-12-03T05:33:59+05:30 IST

ఉద్యోగ నియామకాలకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో అవకతకల కారణంగా ర్యాంకులు సాధించి కూడా తాము నష్టపోయామంటూ మిడిల్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) సిబ్బంది కొందరు బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం గేటు వద్ద నిరసన తెలిపారు.

మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ నిరసన
డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న సిబ్బంది

సీతంపేట, డిసెంబరు 2: ఉద్యోగ నియామకాలకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో అవకతకల కారణంగా ర్యాంకులు సాధించి కూడా తాము నష్టపోయామంటూ మిడిల్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) సిబ్బంది కొందరు బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం గేటు వద్ద నిరసన తెలిపారు. అనంతరం సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ 2018లో కాంట్రాక్టు పద్ధతిలో తమను నియమించారని, నియమకాలు పూర్తిగా జోనల్‌ పద్ధతిలో జరుగుతాయని నోటిఫికేషన్‌లోనే పేర్కొన్నారని గుర్తు చేశారు.


కానీ పోస్టుల భర్తీ సందర్భంగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో అవకతకవల వల్ల మెరిట్‌ సాధించినా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 1400 పోస్టుల భర్తీకి మూడు విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించారన్నారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో పోస్టింగ్‌ పొందిన వారికి నిబంధనలకు విరుద్ధంగా రెండో విడత కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించి పోస్టింగ్‌లు మార్చారన్నారు. దీనిపై తాము అప్పట్లోనే అభ్యంతరం చెబితే మీకూ మూడో కౌన్సెలింగ్‌లో  అవకాశం కల్పిస్తామని మభ్యపెట్టారన్నారు. ఈలోగా కరోనా, లాక్‌డౌన్‌ తదితర సమస్యలతో మూడో కౌన్సెలింగ్‌ను ఆధార్‌, అడ్రస్‌ ప్రాతిపదికన నిర్వహించి వారి నివాస ప్రాంతాలకు యాభై కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్‌ ఇచ్చారని, తమకు మాత్రం వందల కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్‌లు ఇచ్చారని వాపోయారు.


సీఎం జగన్‌ సారధ్యంలో ఏర్పాటవుతున్న విలేజ్‌ క్లినిక్‌లలోనైనా తమకు అవకాశం కల్పించి ఊరికి దగ్గరకు పంపాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే ఏ జోన్‌ అభ్యర్థులకు ఆ జోన్‌లోనే పోస్టింగ్‌లు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పడాల రమణ, యూనియన్‌ నాయకులు అలేఖ్య, అరుణ, సౌజన్య, ప్రజ్ఞవెన్నెల, హరిత, దేవి  పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T05:33:59+05:30 IST