హనుమంతవాక జంక్షన్ వద్ద లారీ బీభత్సం.. టైర్ పేలడంతో..
ABN , First Publish Date - 2020-10-12T16:15:51+05:30 IST
స్టీల్ రేకుల లోడుతో మధురవాడ వైపు నుం చి నగరంలోకి వస్తున్న లారీ హనుమంతవాక కూడలి వద్ద..
మృత్యుశకటం
సిగ్నల్స్ వద్ద వాహనాలపైకి దూసుకుపోయిన లారీ
బైక్‌లపై వున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం
మరో ఐదుగురికి గాయాలు
రెండు ఆటోలు, రెండు కార్లు ధ్వంసం
ఆరిలోవ(విశాఖపట్నం): స్టీల్ రేకుల లోడుతో మధురవాడ వైపు నుం చి నగరంలోకి వస్తున్న లారీ హనుమంతవాక కూడలి వద్ద ఆదివారం బీభత్సం సృష్టించింది. లారీ టైరు పేలడంతో అదుపు తప్పి అప్పటికే సిగ్నల్స్ వద్ద ఆగివున్న వాహనాలపైకి దూసుకుపోయింది. రెండు బైక్‌లపైకి ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడ మృతి చెందారు. ఆటోలో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. రెండు కార్లు, మరో రెండు ఆటోలు ధ్వంసం అయ్యాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణలోని యాదాద్రికి చెందిన గోవింద్ అనే లారీ డ్రైవర్ కోల్‌కతా నుంచి స్టీల్ రేకుల లోడుతో హైదరాబాద్ వెళుతున్నాడు. ఆదివారం ఉద యం 11 గంటల సమయంలో హనుమంతవాక కూడలి వద్దకు వచ్చేసరికి రెడ్ సిగ్నల్ పడింది. అప్పటికే పలు వాహనాలు ఆగి ఉన్నాయి. లారీ డ్రైవ ర్ బ్రేక్ వేస్తుండగా కుడివైపు టైరు పేలిపోయింది. దీంతో లారీ అదుపు తప్పి, ముందు ఆగివున్న వాహనాలపైకి దూసుకుపోయింది. తొలుత ఆటోని ఢీకొట్టగా, అది కుడిపక్కకు బోల్తాపడింది. దీనిలో వున్న ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. లారీ ఆ వెంటనే రెండు బైక్‌లపై నుంచి దూసుకెళ్లింది.
దీంతో బైక్‌లపై ఉన్న పశ్చిమగోదావరి జిల్లా ఉండికి చెందిన చింతలపూడి రామకృష్ణరాజు (29), విజయనగరం జిల్లా బాడంగి మండలం పిన్నవలస గ్రామానికి చెందిన పైలా రాము(29) అక్కడికక్కడే మృతిచెందారు. లారీ మరో రెండు కార్లు, రెండు ఆటోలను కూడా ఢీకొన్న తరువాత కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. హఠాత్ పరిణామంతో అక్కడున్నవారంతా షాక్‌కు గుర య్యారు. ఏం జరిగిందో తెలుసుకు నేలోపే... రక్తపుమడుగులో యువకుల మృతదేహాలు, ధ్వంసమైన బైక్‌లు, ఆటోలు, కార్లతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. జంక్షన్‌లో ట్రాఫిక్ విధుల్లో వున్న పోలీసు సిబ్బంది వెంటనే 108కు, పోలీసు స్టేషన్‌కు సమాచారాన్ని అందించారు.
ద్వారకా ఏసీపీ మూర్తి, ట్రాఫిక్ సీఐ షణ్ముఖరావు, ఎస్‌ఐ సన్యాసిరావు చేరుకుని, గాయపడినవారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు పంపారు. మృతదేహాలను మార్చురీకి తరలించి, రోడ్డుపై పడి ఉన్న వాహనాలను పక్కకు తీసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. లారీ డ్రైవర్ గోవింద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసినట్టు ఏసీపీ మూర్తి తెలిపారు.