టౌన్‌ ప్లానింగ్‌లో అంతర్గత బదిలీలకు సన్నాహాలు

ABN , First Publish Date - 2020-12-13T06:00:35+05:30 IST

జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో భారీగా అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైంది.

టౌన్‌ ప్లానింగ్‌లో అంతర్గత బదిలీలకు సన్నాహాలు
జీవీఎంసీ కార్యాలయం

70 శాతం సిబ్బందికి స్థానచలనం?

విశాఖపట్నం, డిసెంబరు 12(ఆంధ్రజోతి): జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో భారీగా అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైంది. బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి ఏసీపీ స్థాయి వరకూ అందరికీ స్థానచలనం కల్పించాలని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన, చీఫ్‌ సిటీ ప్లానర్‌ ఆర్జే విద్యుల్లత నిర్ణయించారు. ఈమేరకు జాబితా సిద్ధం చేసిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు తుది పరిశీలన నిమిత్తం కమిషనర్‌కు పంపించారు. సోమవారం బదిలీలకు సంబంధించిన తుది ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది. జీవీఎంసీలో నలుగురు ఏసీపీలతోపాటు మరో ఎనిమిది మంది టీపీవోలు, టీపీఎస్‌లు, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లను అమరావతిలోని ప్రధాన కార్యాలయానికి సరెండర్‌ చేయగా, వీరి స్థానంలో ముగ్గురు డీసీపీలు, ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు టీపీఎస్‌లు, ఇద్దరు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లను కేటాయించిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలినవారంతా రిపోర్టుచేశారు. దీంతో వీరందరికీ పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో టౌన్‌ప్లానింగ్‌ విభాగం ప్రక్షాళన చేయాలని అధికారులు భావించారు. విభాగంలో 70 శాతం అధికారులు, ఉద్యోగులను అక్కడి నుంచి వేరొక జోన్‌కు బదిలీ చేయనున్నట్టు సమాచారం.


Updated Date - 2020-12-13T06:00:35+05:30 IST