-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » group 2 36th ranker srividya
-
‘విద్య’ వికాసం
ABN , First Publish Date - 2020-10-31T06:05:08+05:30 IST
శ్రీవిద్య...ఈ పేరులోనే సరస్వతీ నామం ఉంది. అందుకేనేమో ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 పరీక్ష ఫలితాల్లో అద్భుతంగా రాణించి మునిసిపల్ కమిషనర్ ఉద్యోగం పొందింది.

గ్రూప్-2 ఫలితాల్లో 36వ ర్యాంకు సాధించిన శ్రీవిద్య
మహిళల్లో ప్రథమ స్థానం
మునిసిపల్ కమిషనర్‌గా ఉద్యోగం
పాయకరావుపేట, అక్టోబరు 30: శ్రీవిద్య...ఈ పేరులోనే సరస్వతీ నామం ఉంది. అందుకేనేమో ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 పరీక్ష ఫలితాల్లో అద్భుతంగా రాణించి మునిసిపల్ కమిషనర్ ఉద్యోగం పొందింది. పట్టణంలోని లింగాలతోట కాలనీకి చెందిన అనిశెట్టి శ్రీవిద్య (26) రెండు రోజుల క్రితం విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 36వ ర్యాంకు సాధించింది. మహిళా విభాగంలో టాపర్‌గా నిలిచింది. దీంతో మునిసిపల్ కమిషనర్ ఉద్యోగానికి ఎంపికైనట్టు శుక్రవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి.
బాల్యం నుంచే చదువుపై మక్కువ
అనిశెట్టి శ్రీవిద్యకు బాల్యం నుంచి చదువుపై మక్కువ. అన్నింటా టాపర్‌గా నిలిచేది. పదో తరగతి వరకు తునిలోని భాష్యం స్కూల్‌లో చదవగా, ఇంటర్, బీటెక్ నూజివీడు ట్రిపుల్ ఐటీలో పూర్తిచేసింది. గ్రూప్-2 పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి, మునిసిపల్ కమిషనర్‌గా ఎంపికైన శ్రీవిద్య శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, గ్రూప్-2 ఫలితాల్లో మహిళా విభాగంలో టాపర్‌గా నిలిచినందుకు సంతోషం వ్యక్తంచేసింది. తన తండ్రి తాండవ షుగర్ ఫ్యాక్టరీలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారని, అమ్మ గృహిణి అని పేర్కొన్నారు. చదువు విషయంలో తల్లిదండ్రులు ఎన్నడూ తనపై ఒత్తిడి పెట్టలేదని, అందుకే ఇష్టంగా చదువుతూ లక్ష్యాన్ని చేరుకున్నానని చెప్పింది.
నిస్వార్థ సేవలందిస్తా
మునిసిపల్ శాఖలో అధికారిణిగా బాధ్యతలు చేపట్టాక నిస్వార్థంగా సేవలందిస్తానని శ్రీవిద్య వెల్లడించింది. భాష్యం స్కూల్, నూజివీడు ట్రిపుల్ ఐటీ టీచర్స్ బోధన, సూచనలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. ముఖ్యంగా తనను వెన్నంటి ప్రోత్సహించిన తల్లిదండ్రులు, బాబాయ్ లెనిన్ బాబుకు జీవితాంతం రుణపడి వుంటానని శ్రీవిద్య చెప్పారు.