ఆనందపురంలో గ్రావెల్‌ తవ్వకాలు బంద్‌

ABN , First Publish Date - 2020-08-11T09:53:44+05:30 IST

ఆనందపురంలో ఇళ్ల స్థలాల కోసం కొండల్లో క్వారీయింగ్‌ పనులను నిలిపివేశారు.

ఆనందపురంలో గ్రావెల్‌ తవ్వకాలు బంద్‌

వేములవలసలో కొండ తవ్వకాలపై గనుల శాఖ కొరడా 

నిర్వాహకుడికి రూ.18 లక్షలు జరిమానా

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


విశాఖపట్నం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఆనందపురంలో ఇళ్ల స్థలాల కోసం కొండల్లో క్వారీయింగ్‌ పనులను నిలిపివేశారు. మండలంలో ఇళ్ల స్థలాల లెవెలింగ్‌ పేరిట అక్రమంగా కొండల్లో గ్రావెల్‌, రాయి తవ్వకాలపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పందించి కలెక్టర్‌కు ఆదేశాలు ఇవ్వడంతో కిందిస్థాయి అధికారుల్లో కదలిక వచ్చింది. కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఆదేశాల మేరకు సోమవారం నుంచి తవ్వకాలు నిలిపివేసేందుకు  తహసీల్దారు చంద్రశేఖరరావు చర్యలు చేపట్టారు.


కాగా వేములవలసలో కొండ నుంచి ఇప్పటివరకు నాలుగు వేల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌/రాయి తరలించినట్టు గనులశాఖ గుర్తించింది. ఇందుకుగాను సీనరేజ్‌ కింద క్యూబిక్‌ మీటరుకు రూ.45లు వంతున రూ.1.8 లక్షలు చెల్లించాలి. అయితే గనుల శాఖ నుంచి అనుమతి లేకుండా గ్రావెల్‌ తవ్వినందున పది రెట్ల జరిమానా అంటే రూ.18 లక్షలు చెల్లించాలి. దీంతో కొండను తవ్విన వ్యక్తులు మొత్తం రూ.19.8 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గనుల శాఖ  ఒకటి, రెండు రోజుల్లో నోటీసులు అందజేయనుంది.  గండిగుండంలో కూడా అక్రమంగా గ్రావెల్‌ తరలించిన వ్యక్తులకు నోటీసులు ఇవ్వనున్నారు. 

Updated Date - 2020-08-11T09:53:44+05:30 IST