అమ్మను చూడడానికి వెళుతూ.. అనంతలోకాలకు..!!

ABN , First Publish Date - 2020-12-21T05:24:32+05:30 IST

తుని జంక్షన్‌ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటవురట్లకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు.

అమ్మను చూడడానికి వెళుతూ.. అనంతలోకాలకు..!!
మృతిచెందిన దుర్గ (పాత చిత్రం)

  తుని జంక్షన్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం

  తండ్రితో బైక్‌పై వెళుతుండగా ఘటన

  కోటవురట్లలో విషాదం

  కోటవురట్ల, డిసెంబరు 20 : తుని జంక్షన్‌ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటవురట్లకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. తల్లిని చూసేందుకు బైక్‌పై తండ్రితో బయల్దేరిన వారిపాలిట ఓ కంటెయినర్‌ మృత్యు శకటమై ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

   మండల కేంద్రమైన కోటవురట్లకు చెందిన బర్రె వేణయ్య, అతని భార్య లోవలక్ష్మిలు  దసరా పండుగ దాటిన తర్వాత తూ.గో.జిల్లా తుని మండలం కమలపాడులోని ఇటుకల బట్టీలో పనులకు వలస వెళ్లారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు  దుర్గ (17) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, కుమార్తె సంతోషి ఎనిమిదో తరగతి, మరో కుమారుడు తాతాజీ (6) రెండో తరగతి కోటవురట్లలో చదువుతున్నారు. వీరిని తమ నాయనమ్మ పెంటమ్మ వద్ద కోటవురట్లలో ఉంచారు. వేణయ్య కమలపాడు నుంచి శనివారం రాత్రి స్వగ్రామం కోటవురట్ల ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం ఇద్దరు కుమారులను కమలపాడులో ఉన్న  తల్లి వద్దకు బైక్‌పై తీసుకు వెళుతున్నాడు. తుని ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో రోడ్డు మలుపు వద్దకు వెళ్లే సరికి కంటెయినర్‌ వాహనం అతివేగంగా రావడంతో ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో  బైక్‌ అదుపు తిప్పి ఇద్దరు పిల్లలు కంటెయినర్‌ వెనుక చక్రం కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. వేణయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. మరో పది నిమిషాల్లో తల్లిని కళ్లారా చూడాల్సిన ఆ పిల్లలిద్దరినీ కంటెయినర్‌ రూపంలో మృత్యువు కబళించడంతో చూపరులంతా కంటతడిపెట్టారు. పిల్లలు ఇక లేరన్న చేదునిజాన్ని తెలుసుకున్న ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనతో కోటవురట్లలో విషాదఛాయలు అలముకున్నాయి. తుని పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలకు కోటవురట్లలో దహన సంస్కారాలు నిర్వహించారు.

Updated Date - 2020-12-21T05:24:32+05:30 IST