ఒంటిపై నూలుపోగు లేకుండా.. ఇళ్లలోకి దూరి..

ABN , First Publish Date - 2020-09-13T15:27:32+05:30 IST

ఒంటిపై నూలుపోగు లేకుండా ఇళ్లలోకి చొరబడి చోరీలకు..

ఒంటిపై నూలుపోగు లేకుండా.. ఇళ్లలోకి దూరి..

నగ్నంగా వెళ్లి చోరీలు!

తుని సమీపంలోని మరువాడ గ్రామంలో పట్టుకున్న పోలీసులు

ఎవరైనా చూసినా పిచ్చోడనుకుని వదిలేస్తారనే ఈ ఎత్తు

నిందితుడు పాత నేరస్థుడే

అతనికి సహకరించిన మరొకరు కూడా అరెస్టు


మహారాణిపేట(విశాఖపట్నం): ఒంటిపై నూలుపోగు లేకుండా ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని నగర పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కాలంలో వరుస దొంగతనాలతో అప్రమత్తమైన నగర పోలీసులు తుని సమీపంలోని మరువాడ గ్రామంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని కొంత బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరికొంత తనఖా పెట్టినట్టు గుర్తించారు. నిందితుడిని గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన కంచర్ల మోహనరావు (40)గా గుర్తించారు. పలు అంతర్రాష్ట్ర దొంగతనాలతో సంబంధం వున్న ఇతను పలుమార్లు జైలుకు కూడా వెళ్లినట్టు తెలిపారు.


నగరంలో ఇతను దొంగతనాలు చేసేందుకు సాయపడిన వడిశాల సంతోష్‌కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో శనివారం డీసీపీ ఐశ్వర్య రస్తోగి విలేఖరులకు వివరాలు తెలిపారు. మోహనరావు ఉభయ గోదావరి జిల్లాల్లో పలు చోరీలకు పాల్పడి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవించాడని, జైల్లో ఇతనికి అనకాపల్లి టి.వెంకుపాలెం ప్రాంతానికి చెందిన వడిశాల సంతోష్‌కుమార్‌ (26) పరిచయం అయ్యాడని తెలిపారు. జూన్‌ 25న జైలు నుంచి విడుదలైన మోహనరావు అనంతరం సంతోష్‌కు బెయిల్‌ ఇచ్చి బయటకు రప్పించాడని చెప్పారు. ఇద్దరూ కలిసి విశాఖలో చోరీలకు ప్లాన్‌ చేశారన్నారు.


సంతోష్‌ రెక్కీ నిర్వహించి ఇంటిని గుర్తించాక, రాత్రి స్కూటర్‌పై ఇద్దరూ ఆ ఇంటికి చేరుకునేవారని, తర్వాత మోహనరావు దుస్తులన్నీ తీసేసి సంతోష్‌కు ఇచ్చేసి నగ్నంగా ఇంట్లోకి ప్రవేశించి దొరికిన సొత్తును ఎత్తుకు వచ్చేవాడని తెలిపారు. అనంతరం ఇద్దరూ దాన్ని అమ్ముకుని సొమ్ము పంచుకునే వారన్నారు. ఈ విధంగా గత నెల 21న విశాలాక్షినగర్‌లోని కె.మురళీమోహనరావు అనే ఆర్‌ఐ ఇంట్లో రూ.5 లక్షల విలువైన 20 తులాల బంగారం చోరీ చేయగా అతను ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. అలాగే దువ్వాడ, ఎయిర్‌పోర్టు, అనకాపల్లి, కశింకోట స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారని, వరుసగా అందిన ఫిర్యాదులతో అప్రమత్తమై నిఘా పెట్టినట్టు చెప్పారు.


శుక్రవారం నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి కొంత సొత్తు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నగ్నంగా చోరీకి పాల్పడితే ఎవరైనా చూసినా పిచ్చోడనుకుని పట్టించుకోరని, లేదా వారు అవాక్కయి తేరుకునేలోగా తప్పించుకోవచ్చుననే ఎత్తుగడతోనే మోహన్‌రావు ఇలా చేసేవాడని డీసీపీ వివరించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు.

Updated Date - 2020-09-13T15:27:32+05:30 IST