గిరిజన సమస్యలపై ఉద్యమించండి
ABN , First Publish Date - 2020-12-13T06:18:43+05:30 IST
గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ శ్రేణులు ఉద్యమించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు
పాడేరు, డిసెంబరు 12: గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ శ్రేణులు ఉద్యమించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఆయన జూమ్ ద్వారా అరకులోయ పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తదితరులు గిరిజనుల సమస్యలను చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రధానంగా జీవో-3 రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని, అలాగే గిరిజనులకు రాయితీపై రుణాలు ఇవ్వడం లేదని, ఇతర పథకాలను రద్దు చేస్తున్నారని, బెస్ట్ అవైలబుల్ పథకాన్ని నిలుపుదల చేశారని వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబునాయుడు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారిని చైతన్యవంతులను చేసి ఉద్యమించాలన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్‌ను పటిష్ఠం చేసి ప్రజా సమస్యలపై పోరాటాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బాకూరు వెంకటరమణరాజు, పాండురంగస్వామి, సుబ్బారావు, శశిభూషణ్, సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.