గంజాయి జోరు.. ఈ నెలలో ఇప్పటి వరకు 7,321 కిలోలు స్వాధీనం

ABN , First Publish Date - 2020-06-22T15:23:18+05:30 IST

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా జోరుగా సాగుతున్నది. ప్రభుత్వం లాక్‌ డౌన్‌ నిబంధనలు సడలించిన తరువాత గంజాయి తరలింపు ఊపందుకున్నది. వాహనాల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేయడంతో గంజాయి

గంజాయి జోరు.. ఈ నెలలో ఇప్పటి వరకు 7,321 కిలోలు స్వాధీనం

లాక్‌ డౌన్‌ నిబంధనల సడలింపుతో ఊపందుకున్న రవాణా

పోలీసుల తనిఖీలు, నిఘా సైతం బేఖాతరు

భారీ మొత్తంలో రవాణా చేస్తున్న స్మగ్లర్లు

నెల రోజుల్లో 8 వేల కిలోల గంజాయి పట్టివేత, 55 మంది అరెస్టు

జూన్‌లో ఇప్పటి వరకు 7,321 కిలోలు స్వాధీనం

జికేవీధి, పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల నుంచి సరఫరా

నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా


పాడేరు/విశాఖ (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా జోరుగా సాగుతున్నది. ప్రభుత్వం లాక్‌ డౌన్‌ నిబంధనలు సడలించిన తరువాత  గంజాయి తరలింపు ఊపందుకున్నది. వాహనాల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేయడంతో గంజాయి స్మగ్లర్లు ఎగుమతులకు మళ్లీ తెరతీశారు. గత నెల రోజుల్లో పోలీసులు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులు వివిధ ప్రాంతాల్లో సుమారు ఎనిమిది వేల కిలోల గంజాయి పట్టుకుని 50 మందికి పైగా నిందితులను అరెస్టు చేశారు. కాగా పోలీసుల కళ్లుగప్పి, దొడ్డిదారిన ఇంతకన్నా ఎక్కువ మెత్తంలోనే గంజాయి జిల్లా సరిహద్దులు దాటివుంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  


గంజాయి సాగుకు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతం(ఏవోబీ) అడ్డాగా మరింది. ప్రభుత్వ నియంత్రణ శాఖలు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ సాగు, రవాణా మాత్రం ఆగడంలేదు. సాధారణంగా ఏటా జనవరి నుంచి మే నెల వరకు గంజాయి రవాణా అధికంగా జరుగుంది. ఈ ఏడాది కరోనా వైరస్‌ ప్రబలడంతో దీని వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 23వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. దీంతో గంజాయి రవాణాకు బ్రేక్‌ పడింది. కాగా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్పల్ప సడలింపులతో ప్రభుత్వం లాక్‌ డౌన్‌ను పొడిగించుకుంటూ వస్తున్నది. మే మూడో వారం నుంచి లాక్‌ డౌన్‌ నిబంధనల్లో చాలా వరకు సడలింపులు ఇచ్చింది. దాదాపు అన్ని రకాల వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. అప్పటికే రెండు నెలల నుంచి గంజాయి రవాణాకు వీలుకాక ఎక్కడికక్కడ నిల్వ చేసిన స్మగ్లర్లు.... ఇదే అదనుగా భావించి సరుకును జిల్లా సరిహద్దులు దాటించడానికి నడుం బిగించారు. గత నెల రోజుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు పట్టుకుని గంజాయి, అరెస్టు చేసిన నిందితులను పరిశీలిస్తే... జిల్లాలో కరోనా వైరస్‌ ఎంత వేగంగా వ్యప్తి చేందుతున్నదో గంజాయి రవాణా కూడా అంతే వేగంగా పెరుగుతున్నది. గత నెల మూడో వారంలో లాక్‌ డౌన్‌ నిబంధనలు సడలించిన తరువాత వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. దాదాపు రెండు నెలల తరువాత మే 16వ తేదీన తొలిసారి మాడుగుల మండలం సాగరం వద్ద పోలీసులు గంజాయి పట్టుకున్నారు. ఆటోలో తరలిస్తున్న 110 కిలోల గంజాయితో ముగ్గురిని అరెస్టు. మరో ఇద్దరు పరారయ్యారు. మే నెలలో పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి 513 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఈ సందర్భంగా 11 మందిని అరెస్టు చేశారు. కొంతమంది పారిపోయారు. పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 29వ తేదీన కొయ్యూరు మండలం చీడిపాలెం వద్ద 110 కిలోలు, అదే రోజు నర్సీపట్నంలో 272 కిలోల గంజాయిని పట్టుకుని సీజ్‌ చేశారు. 


జూన్‌లో 7 వేల కిలోలపైనే....

జూన్‌లో స్మగ్లర్లు గంజాయి రవాణాను ఉధృతం చేశారు. పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు సైతం నిఘా, తనిఖీలను మరింత ఉధృతం చేశారు. పలుచోట్ల పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. జూన్‌ 5న జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీ కిముడుపల్లిలో 300 కిలోల గంజాయితో ఐదుగురిని అరెస్టు చేశారు. మరుసటి రోజే జీకేవీధి మండలం వంతాడపల్లిలో 900 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 8వ తేదీన పెదబయలు మండలం చుట్టమెట్ట వద్ద 1,140 కిలోల గంజాయితో ఇద్దరిని అరెస్టు చేశారు. 9వ తేదీన కొయ్యూరు మండలం డౌనూరు వద్ద 1,010 కిలోలతో ఇద్దరిని అరెస్టు చేశారు. కాగా  18వ తేదీన మూడుచోట్ల భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. చింతపల్లి మండలం లంబసింగి జంక్షన్‌లో 970 కిలోలతో ఇద్దరిని, కొయ్యూరు మండలం మర్రిపాలెం అటవీ చెక్‌పోస్టు వద్ద 800 కిలోల గంజాయితో ముగ్గురిని, హుకుంపేట మండలం డి.చింతలవీధి వద్ద 770 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 20వ తేదీన హుకుంపేట మండలంలో 700 కిలోల గంజాయితో ఎనిమిది మందిని, నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌ ప్లాజా వద్ద 630 కిలోల గంజాయితో ఇద్దరిని అరెస్టు చేశారు. 


రవాణా మార్గాలు...

ఏజెన్సీలో గంజాయి సాగవుతున్న జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల నుంచి మైదాన ప్రాంతాలకు వివిధ మార్గాల్లో రవాణా చేస్తున్నారు. జీకేవీధి, చింతపల్లి ప్రాంతాల నుంచి నర్సీపట్నం, తుని మీదుగా, అటు తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి మీదుగా తరలిస్తున్నారు. జి.మాడుగుల మండలం నుంచి అటు ఒడిశాకు, ఇటు పాడేరు, చోడవరం మీదుగా అనకాపల్లి ప్రాంతానికి చేరుస్తున్నారు. ముంచంగిపుట్టు మండలం నుంచి అటు ఒడిశాకు, ఇటు హుకుంపేట, అరకులోయ మండలాల మీదుగా ఎస్‌.కోట ప్రాంతానికి తరలిస్తున్నారు. పోలీసులు ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహిస్తూ ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, వ్యాన్లు, లారీల్లో రవాణా అవుతున్న గంజాయిని పట్టుకుంటున్నారు. కానీ ఇదే సమయంలో ప్రధాన రహదారుల్లో కాకుండా ఇతర మార్గాల ద్వారా ఏజెన్సీ నుంచి అనకాపల్లి, నర్సీపట్నం, తుని, విశాఖపట్నం ప్రాంతాలకు చేర్చుతున్నారు. అక్కడి నుంచి వీలునుబట్టి వాహనాల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.

Updated Date - 2020-06-22T15:23:18+05:30 IST