లిక్విడ్‌గా గంజాయి

ABN , First Publish Date - 2020-12-30T06:02:03+05:30 IST

విశాఖ ఏజెన్సీలోని పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, మంచంగిపుట్టు, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు, అనంతగిరి మండలాల పరిధిలోని సుమారు 150 గ్రామాల్లో గంజాయి సాగవుతోంది.

లిక్విడ్‌గా గంజాయి

పోలీసుల కళ్లు కప్పేందుకు స్మగ్లర్ల ఎత్తుగడ

సీసాలు, ప్యాకెట్లలో నింపి ఏజెన్సీ నుంచి నగరానికి రవాణా

ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలింపు

పెందుర్తి ఉదంతంతో అప్రమత్తమైన పోలీసులు

స్మగ్లర్లకు చెక్‌ పెట్టేందుకు నిఘా


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


పెందుర్తిలోని ఒక అపార్టుమెంట్‌పై కొద్దిరోజుల కిందట పోలీసులు దాడి చేసి లిక్విడ్‌ గంజాయి (దీనిని స్మగర్లు, వినియోగదారులు హాసిన్‌ ఆయిల్‌గా పిలుస్తారు)ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 


హైదరాబాద్‌లో లిక్విడ్‌ గంజాయి వినియోగిస్తున్న కొంతమంది యువకులను ఇటీవల అక్కడి పోలీసులు పట్టుకున్నారు. వారికి లిక్విడ్‌ గంజాయి విశాఖ నుంచే సరఫరా అయినట్టు విచారణలో తేలింది. 


...గంజాయి రవాణా కొత్తరూపం సంతరించుకుందనేందుకు పైన పేర్కొన్న రెండు సంఘటనలను నిదర్శనంగా భావిస్తున్న పోలీసులు దానికి అడ్డుకట్ట వేయడంపై దృష్టిపెట్టారు.


విశాఖ ఏజెన్సీలోని పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, మంచంగిపుట్టు, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు, అనంతగిరి మండలాల పరిధిలోని సుమారు 150 గ్రామాల్లో గంజాయి సాగవుతోంది. గిరిజనులకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, స్మగ్లర్లు పెట్టుబడి పెట్టి గంజాయిని సాగు చేయిస్తున్నారు. కోతకొచ్చిన గంజాయిని ఎండబెట్టిన అనంతరం అర కిలో నుంచి రెండు కిలోల పరిమాణంలో చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి రవాణాకు సిద్ధం చేస్తారు. ఆ ప్యాకెట్లను పలు మార్గాల్లో మైదాన ప్రాంతాలకు చేరవేసి, అక్కడ నుంచి దేశ, విదేశాలకు రవాణా చేస్తుంటారు. ఈ క్రమంలో గంజాయిని భద్రపరిచేందుకు అనుగుణంగా వాహనాల్లో మార్పులు చేస్తుంటారు. అయితే కొంతకాలంగా పోలీసులు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) ప్రత్యేక నిఘా పెట్టడంతో పెద్దఎత్తున గంజాయి పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో స్మగ్లర్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. డ్రై గంజాయిని ఏజెన్సీలోనే ద్రవరూపం (లిక్విడ్‌ గంజాయి)లోకి మార్చి బాటిళ్లలో నింపుతున్నారు. దీనిని మహిళల ద్వారా గుట్టుగా మైదాన ప్రాంతాలకు, నగరానికి తరలిస్తున్నారు. కొన్నాళ్ల కిందట హైదరాబాద్‌లో కొంతమంది యువకులు లిక్విడ్‌ గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. విచారణలో విశాఖ ఏజెన్సీ నుంచి వచ్చిందనే విషయం తేలింది. తాజాగా పెందుర్తిలోని వీవీ కృష్ణరామ రెసిడెన్సీలోని ఐదో అంతస్తులోని ఒక ఫ్లాట్‌లో పంచాది వసుంధర (21), కొంగు శిరీష (21) లిక్విడ్‌ గ ంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. లిక్విడ్‌ గంజాయిని హుక్కా కుండల్లో వేసిన తర్వాత ఆవిరిని గొట్టంతో పీల్చుతూ కొందరు, సిగరెట్లపై చుక్కలు వేసుకుని తాగడం ద్వారా మరికొందరు మత్తులో మునిగితేలుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. డ్రై గంజాయితో పాటు ఈ లిక్విడ్‌ గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయడంపై పోలీసులు దృష్టిసారించారు.


గంజాయి రవాణా ఏ రూపంలో జరిగినా వదిలే ప్రసక్తి లేదు

డి.శ్రావణ్‌కుమార్‌, ఏసీపీ సీసీఎస్‌


గంజాయి రవాణా ఏ రూపంలో జరిగినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. రవాణా చేసేవారితోపాటు వారిని వెనకుండి ప్రోత్సహిస్తున్నవారు, సహకరిస్తున్న వారిపై కూడా ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నాం. గంజాయి స్మగ్లింగ్‌ను కూకటివేళ్లతో సహా పెకిలించాలన్నదే సీపీ మనీష్‌కుమార్‌సిన్హా లక్ష్యం. ఆయన ఆదేశాలు, సూచనల మేరకు స్మగ్లర్లపైనా, రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. ఇటీవల కాలంలో భారీగా గంజాయి పట్టుబడడానికి కారణం అదే.

Updated Date - 2020-12-30T06:02:03+05:30 IST