ఆరుగురు సభ్యుల దోపిడీ ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2020-09-25T11:37:27+05:30 IST

ఓ ఆటోడ్రైవర్‌ నుంచి బలవంతంగా ఆటోలాక్కుని దాన్ని ఉపయోగించుకుని దోపిడీలకు పాల్పడిన ఆరుగురు

ఆరుగురు సభ్యుల దోపిడీ ముఠా అరెస్టు

మహారాణిపేట, సెప్టెంబరు 23: ఓ ఆటోడ్రైవర్‌ నుంచి బలవంతంగా ఆటోలాక్కుని దాన్ని ఉపయోగించుకుని దోపిడీలకు పాల్పడిన ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు డీసీపీ క్రైం సురేష్‌బాబు తెలిపారు. కమిషనరేట్‌ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గాజువాకలోని బానోజీ కాలనీకి చెందిన మచ్చెర్ల గణేష్‌ (30), రైల్వేన్యూకాలనీకి చెందిన నాగమల్లి యల్లాజీ (31), శ్రీహరిపురానికిచెందిన తాళ్లూరి కుమార్‌ (20), బి.రాజు, బండారి బాబుతోపాటు ఓ మైనర్‌ ఈనెల 22వ తేదీ రాత్రి ఓ ఆటో డ్రైవర్‌ను బెదిరించి ఆటో ఎత్తుకుపోయారు. రాత్రి 10.15 గంటల సమయంలో ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఓ పాసింజరును ఎక్కించుకుని కాకానీ నగర్‌ వద్ద 4,800 నగదు, సెల్‌ఫోన్‌ దోచుకున్నారు. అర్ధరాత్రి 12.15 గంటలకు దువ్వాడ సమీపం శనివాడ వద్ద ఇద్దరు మహిళలను ఆటో ఎక్కించుకున్నారు.


కొంతదూరం వెళ్లాక వారిని కత్తితో బెదిరించి నగదు, వస్తువులు దోచుకుని ఆటో నుంచి తోసేసారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘాపెట్టి జింక్‌ గేట్‌ వద్ద నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఆటో, 1800 నగదు, ఏటీఎం కార్డు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో మైనర్‌ని జువైనల్‌ హోంకి, మిగిలిన వారిని జైలుకి రిమాండకు తరలించారు. గణేష్‌, యల్లాజీలపై గతంలోనే కేసులున్నాయని డీసీపీ తెలిపారు.

Updated Date - 2020-09-25T11:37:27+05:30 IST