ఆ రెండు జిల్లాలకు ప్రయాణికుల తాకిడి

ABN , First Publish Date - 2020-05-24T08:19:55+05:30 IST

విశాఖ నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఒక్కమారుగా పెరిగింది.

ఆ రెండు జిల్లాలకు ప్రయాణికుల తాకిడి

శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల బస్సుల రద్దీ

నేడు 100 అదనపు పీటీడీ సర్వీసులు

మద్దిలపాలెం డిపోలో రిజర్వేషన్‌ కౌంటర్‌

రీజియన్‌లో సగటు  ఓఆర్‌ 40 శాతం


ద్వారకాబస్‌స్టేషన్‌: విశాఖ నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఒక్కమారుగా పెరిగింది. దీంతో వీరిని తరలించేందుకు పీటీడీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం శనివారం 122 షెడ్యూల్‌ సర్వీసులతోపాటు 52 అదనపు సర్వీసులు నడిపింది.  విజయవాడ నుంచి 30 బస్సుల్లో, రాజమండ్రి నుంచి 35 బస్సుల్లో ప్రయాణికులు చేరుకోవడంతో అదనపు బస్సులు నడపాల్సి వచ్చింది.  రీజనల్‌ మేనేజర్‌ ఎం.యేసుదానం, డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్లు సుధాబిందు(అర్బన్‌), కణితి వెంకటరావు(విశాఖ జిల్లా) పర్యవేక్షణలో ట్రాఫిక్‌ నియంత్రించారు.  


నేడు 100 అదనపు సర్వీసులు

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విశాఖ వచ్చిన ప్రయాణికులను వారి సొంత జిల్లాలకు పంపేందుకు ఆదివారం 126 షెడ్యూల్‌  సర్వీసులతోపాటు 100 అదనపు సర్వీసులు నడపాలని ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 80 బస్సుల్లో ప్రయాణికులు విశాఖ రానున్నారు. ద్వారకా కాంప్లెక్స్‌లో ప్రయాణికుల నియంత్రణకు 40 మంది కండక్టర్లతో రోప్‌ పార్టీలు ఏర్పాటు చేశారు. మద్దిపాలెంలో అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌ ఏర్పాటు చేయనున్నారు.


పీటీడీ ఓఆర్‌ 40 శాతం

పీటీడీ విశాఖ రీజియన్‌కు శనివారం సగటు 40 శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌) నమోదయ్యింది. బస్సు సీట్ల సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం మందికే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన విధించింది. విజయవాడ, అమలాపురం ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో 36శాతం, రాజమండ్రి, కాకినాడ, తుని ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో 38 శాతం ఓఆర్‌ నమోదవుతున్నది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 44 శాతం, జిల్లాలో తిరిగే సర్వీసుల్లో 36 శాతం నమోదవుతున్నది.

Updated Date - 2020-05-24T08:19:55+05:30 IST