పరిశ్రమల్లో తరచూ తనిఖీలు
ABN , First Publish Date - 2020-07-19T10:11:43+05:30 IST
అధికారులు ఇకపై పరిశ్రమల్లో తరచూ తనిఖీలు నిర్వహిస్తారని, అవి భద్రతకు సంబంధించినవిగానే

వేధింపుల కోసం కాకుండా భద్రతపై దృష్టి
వ్యవస్థలో లోపాలు, మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు
ప్రతి పరిశ్రమలో భద్రత పరికరాలు ఉండాల్సిందే
మూడు నెలలకోసారి సమీక్ష
పరిశ్రమల్లో భద్రతపై నాలుగు బృందాలతో తనిఖీలు
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
విశాఖపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): అధికారులు ఇకపై పరిశ్రమల్లో తరచూ తనిఖీలు నిర్వహిస్తారని, అవి భద్రతకు సంబంధించినవిగానే ఉంటాయని వేధింపుల కోసం కాదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ‘పరిశ్రమల్లో భద్రత.. చేపట్టాల్సిన చర్యల’పై అధికారులు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో మంత్రి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల విశాఖలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికి మానవ తప్పిదాలు కొంత కారణమైతే, వ్యవస్థలో లోపాలు మరికొంత కారణమని గుర్తించామన్నారు.
పరిశ్రమలకు లైనెన్సులను ఒక్కొక్కరికి ఒక్కోలా ఇస్తున్నారన్నారు. జీవితకాలం లైసెన్సులు ఇచ్చిన పరిశ్రమలకు రెన్యువల్ అవసరం లేపోవడంతో చాలా సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు తేలిందన్నారు. అలాగే తనిఖీలు లేకపోవడం వల్ల ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో తెలియడం లేదన్నారు. విశాఖలో కొన్ని పరిశ్రమల యజమానులు హైదరాబాద్‌లో ఉండి, ఇక్కడ ఏజెంట్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, దానివల్ల కూడా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయన్నారు. కాలుష్య నియంత్రణ మండలికి అవసరమైనంత సిబ్బంది లేరని, అగ్నిమాపక వాహనాలు కూడా అవసరమని గుర్తించామన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అవసరమైనవన్నీ సమకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పరిశ్రమల్లో భద్రతపై మూడు నెలలకోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, ప్రస్తుతం అన్ని పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించి భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ నాలుగు బృందాలను వేశారని, వారంతా ఈ నెల 29 వరకు పరిశ్రమలను తనిఖీ చేస్తారని చెప్పారు. ఇటీవల రాంకీ ఫార్మాసిటీలో రెండు ప్రమాదాలు జరిగాయని, ఈ నేపథ్యంలో దువ్వాడ విఎస్‌ఈజడ్, అచ్యుతాపురం ఎస్‌ఈజడ్‌లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించామన్నారు.
మాక్‌డ్రిల్స్ నిర్వహించాలి: ఆర్‌కే మీనా, సీపీ
పరిశ్రమల్లో మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, భద్రతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని నగర పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా సూచించారు. సాంకేతిక నైపుణ్యం కలిగినవారినే నియమించుకోవాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో తప్పనిసరిగా మాక్‌డ్రిల్ నిర్వహించాలని, స్థానిక ప్రజలను వాటిలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మాధవి, ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఫ్యాక్టరీస్, బాయిలర్స్, కాలుష్య నియంత్రణ మండలి శాఖల అధికారులు పాల్గొన్నారు.