రికవరీలో టాప్‌.. ఇప్పటివరకూ విశాఖలో నలుగురు డిశ్చార్జి

ABN , First Publish Date - 2020-04-09T16:58:06+05:30 IST

కోవిడ్‌-19 కేసుల రికవరీలో విశాఖపట్నం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అదే విధంగా పాజిటివ్‌ కేసులు ఇతర జిల్లాల్లో శరవేగంగా పెరుగుతుండగా జిల్లాలో మాత్రం ఆ సంఖ్య గత రెండు రోజులుగా స్థిరంగా ఉంది. కొత్త కేసులు ఏవీ నమోదు కాలేదు.

రికవరీలో టాప్‌.. ఇప్పటివరకూ విశాఖలో నలుగురు డిశ్చార్జి

(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): కోవిడ్‌-19 కేసుల రికవరీలో విశాఖపట్నం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అదే విధంగా పాజిటివ్‌ కేసులు ఇతర జిల్లాల్లో శరవేగంగా పెరుగుతుండగా జిల్లాలో మాత్రం ఆ సంఖ్య గత రెండు రోజులుగా స్థిరంగా ఉంది. కొత్త కేసులు ఏవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో బుధవారం రాత్రి వరకూ మొత్తం 348 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అందులో కర్నూలు (75), గుంటూరు (49), నెల్లూరు (48) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కేసులపరంగా చూసుకుంటే...విశాఖపట్నం జిల్లా కింద నుంచి ఐదో స్థానంలో ఉంది. ఇరవై కేసులు మాత్రమే ఇక్కడ నమోదయ్యాయి. ఇక రికవరీ పరంగా చూసుకుంటే...కృష్ణా జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున రికవరీ కాగా విశాఖపట్నం జిల్లాలో నలుగురు రికవరీ అయ్యారు. విశాఖలో తొలి కోవిడ్‌ కేసు అల్లిపురం ప్రాంతానికి చెందిన  65 ఏళ్ల వ్యక్తి ఐదు రోజుల క్రితం డిశ్చార్జి కాగా... బుధవారం మరో ముగ్గురిని ఇంటికి పంపించారు. వారిలో అల్లిపురం వ్యక్తి భార్య, పద్మనాభం మండలం రేవిడి వెంకటాపురానికి చెందిన యువకుడు, అతడి తండ్రి ఉన్నారు. కాగా మరో 16 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో ఎవరికీ సీరియస్‌గా లేదని, వారు కూడా కోలుకుంటారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. 


రెడ్‌ జోన్లు...హాట్‌ స్పాట్లు కావు : కలెక్టర్‌  

గతంలో పాజిటివ్‌ కేసులు గుర్తించిన ప్రాంతాలను రెడ్‌జోన్లు, హాట్‌స్పాట్లుగా వ్యవహరించారని, అయితే ఆ పదాలను ప్రభుత్వం ఉపసంహరించుకుందని, ఇకపై ఆయా ప్రాంతాలను కంటెయిన్‌మెంట్‌ జోన్లుగానే వ్యవహరిస్తారని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. విశాఖపట్నంలో ఏడు కంటెయిన్‌మెంట్‌ జోన్లు (అల్లిపురం, ముస్లిం తాటిచెట్లపాలెం, రైల్వే న్యూకాలనీ, రేవిడి, గాజువాక, నర్సీపట్నం, పూర్ణామార్కెట్‌) గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో పాజిటివ్‌ వచ్చిన వారితో కాంటాక్ట్‌ అయినవారు, ఇతర రకాలుగా అనుబంధం వున్నారనే అనుమానంతో 437 మందిని గుర్తించి వారికి దశల వారీగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వారిలో 67 మంది నుంచి బుధవారం శాంపిల్స్‌ తీసుకున్నారని, 65 మందికి నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని, ఇద్దరికి అనుమానంగా వుండగా, మరోసారి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. 

Updated Date - 2020-04-09T16:58:06+05:30 IST