జీవీఎంసీ వినూత్న యోచన.. వ్యర్థ జలాలతో..

ABN , First Publish Date - 2020-12-17T06:11:42+05:30 IST

వృథాగా పోతున్న వ్యర్థజలాలతో నగరంలోని వివిధ కూడళ్లలోని వాటర్‌ ఫౌంటెయిన్లు వినూత్న శోభను సంతరించుకుంటున్నాయి.

జీవీఎంసీ వినూత్న యోచన.. వ్యర్థ జలాలతో..
శుద్ధిచేసిన నీటితో సిరిపురం కూడలిలో వాటర్‌ఫౌంటైన్‌

విశాఖపట్నం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వృథాగా పోతున్న వ్యర్థజలాలతో నగరంలోని వివిధ కూడళ్లలోని వాటర్‌  ఫౌంటెయిన్లు వినూత్న శోభను సంతరించుకుంటున్నాయి. రాత్రిసమయంలో విద్యుత్‌కాంతుల వెలుగులో ఎగసిపడుతున్న నీటితో కూడళ్లు సరికొత్త అందాలను ఆవిష్కరిస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021లో ఉత్తమర్యాంకు సాధించేందుకు వీలుగా విశాఖను ‘వాటర్‌ప్లస్‌ నగరం’గా తీర్చిదిద్దేందుకు తీర్మానం చేశారు. ఇందులో భాగంగా వృథాగా పోతున్న నీటిని పునర్వినియోగం చేస్తారు. నగరంలో యూజీడీ ద్వారా సివేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు (ఎస్‌టీపీ) చేరుతున్న మురుగునీటిలో 107 ఎంఎల్‌డీ నీటిని శుద్ధిచేస్తున్నారు. ఇందులో 90 ఎంఎల్‌డీ నీటిని పార్కులు, గ్రీనరీ అభివృద్ధి, ముడసర్లోవ వద్ద ఉన్న గోల్ఫ్‌కోర్టు, పోర్టు, స్టీల్‌ప్లాంట్‌కు కేటాయిస్తున్నారు. మిగిలిన 17 ఎంఎల్‌డీ నీటిని సముద్రంలోకి విడిచిపెట్టేస్తున్నారు.


స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా శుద్ధిచేసిన నీటిని శతశాతం పునర్వినియోగించాలి. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో వాటర్‌ ఫౌంటెయిన్లు నిర్మించడం ద్వారా లక్ష్యం చేరాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.30 లక్షల వ్యయంతో సిరిపురం జంక్షన్‌లో మూడు, జగదాంబ కూడలి వద్ద ఒకటి, వుడా చిల్డ్రన్‌ ఎరీనా వద్ద ఒకటి, గాజువాక పెదగంట్యాడ రోడ్డు సర్కిల్‌లో ఒకటి, పాతగాజువాక జంక్షన్‌ వద్ద ఒక ఫౌంటెయిన్‌ నిర్మించారు. వీటికి సమీపంలోని ఎస్‌టీపీల నుంచి ట్యాంకర్లతో ప్రతి రోజూ 30 కిలోలీటర్ల నీటిని తరలిస్తున్నారు. త్వరలోనే మరిన్ని చోట్ల ఫౌంటెయిన్లను ఏర్పాటు చేయాలని జీవీఎంసీ అధికారులు భావిస్తున్నారు.


Updated Date - 2020-12-17T06:11:42+05:30 IST