-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » former minister chinnarajappa
-
పెచ్చుమీరిన సాయిరెడ్డి ఆగడాలు
ABN , First Publish Date - 2020-11-25T13:19:00+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో..

మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ధ్వజం
జగన్మోహన్‌రెడ్డి దోచుకోమని ఒక్కో నేతకు ఒక్కో జిల్లాను కట్టబెట్టినట్టున్నారంటూ ఎద్దేవా
విశాఖ ఎయిర్‌పోర్టును ఎవరూ కదిలించలేరు: బండారు
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఒక్కో జిల్లాను ఒక్కో నాయకుడికి అప్పగించి దోచుకోవాలని చెప్పినట్టున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు. అందులో భాగంగానే విశాఖను విజయసాయిరెడ్డికి, తూర్పుగోదావరి జిల్లాను ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి అప్పగించినట్టున్నారన్నారు. మంగళవారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలో విజయసాయిరెడ్డి, ఆయన అనుయాయుల ఆగడాలు పెరిగిపోయాయన్నారు. మాజీ మంత్రి బండారు స త్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఒంగోలుకు చెందిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి పెందుర్తిలో రైతుల భూములను ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని, దీనివెనుక విజయసారెడ్డి వున్నట్టు భావించామని, అయితే ఏకంగా ముఖ్యమంత్రే వున్నట్టు తేలిందని ఆరోపించారు.
విజయసాయిరెడ్డి ఒక వలస పక్షి అని, భోగాపురంలో ఎయిర్‌పోర్టు ప్రారంభమైనా...విశాఖ ఎయిర్‌పోర్టు కొనసాగుతుందన్నారు. దాన్ని ఎవరు మార్చాలని చూసినా చెప్పు దెబ్బలు తప్పవని అన్నారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీలు నియమిస్తున్నామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి, మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు.
మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ తుంగభద్ర పుష్కరాలను సరిగా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని విమర్శించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్....టీడీపీ నేతలను చవటలు, దద్దమ్మలు అంటూ విమర్శిస్తున్నారని, అదే పార్టీ గుర్తుపై రెండుసార్లు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారన్న విషయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి గెలవాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీలు పప్పల చలపతిరావు, దువ్వారపు రామారావు, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు బుద్ధ నాగదీశ్వరరావు, పట్టాభి, పలువురు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.