మాజీ కార్పొరేటర్‌ పీలా ఉమారాణి భర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-08-18T15:58:48+05:30 IST

మాజీ కార్పొరేటర్‌ పీలా ఉమారాణి భర్త వెంకటగిరి శ్రీనివాస్‌ (54) పురుగుల మందు తాగి..

మాజీ కార్పొరేటర్‌ పీలా ఉమారాణి భర్త ఆత్మహత్య

పురుగుల మందు తాగి బలవన్మరణం

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో విగతజీవిగా పడి ఉన్న వైనం


కూర్మన్నపాలెం(విశాఖపట్నం): మాజీ కార్పొరేటర్‌ పీలా ఉమారాణి భర్త వెంకటగిరి శ్రీనివాస్‌ (54) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. దువ్వాడ రైల్వే స్టేషన్‌ నాలుగో ప్లాట్‌ఫారం చివరన సోమవారం సాయంత్రం వెంకటగిరి శ్రీనివాస్‌ విగతజీవిగా పడి ఉన్నారు. దీనిని గమనించిన జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సిబ్బంది వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించి మృతి చెందినట్టు నిర్ధారించారు. జీఆర్పీ సిబ్బంది ఆయన బ్యాగును తనిఖీ చేయగా అందులో క్రిమి సంహారక మందులు, సూసైడ్‌ నోట్‌ ఉన్నాయి. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించుకున్నారు.


భార్య పీలా ఉమారాణితో కలిసి ఆయన నగరంలోని పిఠాపురం కాలనీలో నివాసముంటున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం ఆయన కోరమండల్‌ గేటు సమీపంలో వుంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వచ్చినట్టు తెలిసింది. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సిబ్బంది దీనిని ఆత్మహత్యగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 


ఎవరికీ చెప్పలేకపోతున్నా...అందుకే..!

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పీలా ఉమారాణి భర్త వెంకటగిరి శ్రీనివాస్‌ వద్ద రైల్వే పోలీసులకు సూసైడ్‌ నోట్‌ లభించింది. దానిని పరిశీలించిన తరువాత సీజ్‌ చేశారు. అందులో వివరాల ప్రకారం...ఇంట్లో ఆర్థిక, కుటుంబ విషయాలపై అనేక గొడవలు జరుగుతున్నాయని, ఎవరూ తాను చెప్పినట్టు వినడం లేదని, సర్ది చెప్పలేకపోతున్నానని, అందుకే చనిపోతున్నానని పేర్కొన్నట్టు తెలిసింది.


ఆయన తీవ్రమైన ఒత్తిడికి లోనై ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతున్నదని పోలీస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండేవని, ఇటీవల కాలంలో కలిసిపోయి ఇంట్లో శుభకార్యాలు కూడా నిర్వహించారని స్నేహితులు చెబుతున్నారు. ఏదేమైనా కుటుంబంలో కొన్ని వివాదాలు ఉన్నాయంటున్నారు.


Updated Date - 2020-08-18T15:58:48+05:30 IST