ఫుట్‌బాల్‌ దిగ్గజం వీరుబాబు ఇకలేరు

ABN , First Publish Date - 2020-09-06T09:54:20+05:30 IST

ఫుట్‌బాల్‌ దిగ్గజం వీరుబాబు ఇకలేరు

ఫుట్‌బాల్‌ దిగ్గజం వీరుబాబు ఇకలేరు

విశాఖపట్నం(స్పోర్ట్సు), సెప్టెంబరు 5: విశాఖ ఫుట్‌బాల్‌ చరిత్రలో మరో దిగ్గజం నేలకూలింది. అంతర్జాతీయ రైల్వే ఫుట్‌బాలర్‌ వి.వీరుబాబు(63) శనివారం అనారోగ్యంతో అకాల మరణం చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. నగరంలోని వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన వీరుబాబు 1970లో ఫుట్‌బాల్‌ క్రీడలో ప్రవేశించి అతి తక్కువ కాలంలో అద్భుతమైన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు.  సీనియర్‌ లెవెల్‌ ఫుట్‌బాల్‌లో అత్తిలి సూరిబాబు స్మారక క్లబ్‌కు తొలిసారిగా ప్రాతినిధ్యం వహించిన 1976లో రైల్వేలో స్పోర్ట్సు కోటాలో ఉద్యోగం పొందారు. అప్పటికీ భారత ఫుట్‌బాల్‌ రంగంలో ప్రతిష్టాత్మక జట్లలో ఒకటైన బెంగాల్‌ నాగపూర్‌ రైల్వే(బీఎన్‌ఆర్‌) జట్టుకు ప్రాతినిధ్యం వహించి తన ఆటతో అద్భుతాలు సృష్టించాడు.


భారతీయ రైల్వే ఫుట్‌బాల్‌ జట్టు తరుపున వరుసగా నాలుగు సార్లు సంతోష్‌ ట్రోఫీకి  ప్రాతినిధ్యం వహించి జట్టును విజయపథంలో నడిపించాడు. అంతేకాకుండా డురాండ్‌ కప్‌, రోవర్స్‌ కప్‌, స్టీల్‌ కప్‌ వంటి పోటీల్లో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి విశేష ఖ్యాతినార్జించారు. నైజీరియాలో 1981లో జరిగిన వరల్డ్‌ రైల్వేస్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వీరుబాబు మృతి పట్ల రాష్ట్ర ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు కొసరాజు గోపాలకృష్ణ,  జిల్లా ఫుట్‌బాల్‌ సంఘం కార్యదర్శి అత్తిలి జగన్నాధరావు సంతాపం ప్రకటించారు. 

Updated Date - 2020-09-06T09:54:20+05:30 IST