మృతుడి కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-07-28T10:07:33+05:30 IST

సెజ్‌పునరావాస కాలనీ కొత్త కోడూరుకు చెందిన ఒక వ్యాపారి(47) మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులు ఐదుగురికి కరోనా ..

మృతుడి కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్‌

చనిపోయిన వ్యక్తి వివరాలు గోప్యతతో విస్తరించిన వైరస్‌?


అచ్యుతాపురం : సెజ్‌పునరావాస కాలనీ కొత్త కోడూరుకు చెందిన ఒక వ్యాపారి(47) మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులు ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. చనిపోయిన వ్యక్తి వివరాలు దాచడంతో వైరస్‌ విస్తరించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అచ్యుతాపురం సాయినగర్‌లో నివాసం ఉంటున్న కొత్తకోడూరుకు చెందిన వ్యాపారి పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ అచ్యుతాపురంలో తెలిసిన వైద్యుల వద్ద సేవలు పొందాడు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన బంధువులు కారులో విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ తప్పుడు ఆధార్‌ నంబరు ఇచ్చారు. ఆ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్‌ వచ్చిందని చేర్పించుకోవడానికి నిరాకరించారు. దీంతో కేజీహెచ్‌కు తీసుకు వెళ్లారు. అక్కడ బెడ్స్‌ ఖాళీ లేకపోవడంతో అక్కడ కూడా చేర్చుకోలేదు. ఒక రాజకీయనాయకుడి పలుకుబడితో మరో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.


మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా అచ్యుతాపురంలో తీసుకు వచ్చి బుధవారం పూడ్చివేశారు. ఆధార్‌ నెంబర్‌ తప్పు ఉండడంతో అధికారులు గమనించలేకపోయారు. అయితే కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి వారు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కుటుంబ సభ్యులు ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మృతుని భార్య (40), ఇద్దరు కుమారులు (25), (21), మృతుని అన్న కుమార్తె (27), మృతుని అత్త (65)కి పాజిటివ్‌ వచ్చిందని ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపారు. ఆయనతోపాటు కారులో వెళ్లిన ముగ్గురు బంధువులు క్వారంటైన్‌లో ఉన్నారని తెలిసింది. 

Updated Date - 2020-07-28T10:07:33+05:30 IST