పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌

ABN , First Publish Date - 2020-12-30T05:59:37+05:30 IST

జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి గురువారం ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు.

పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌
ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించేది ఇక్కడే (ఉప్పుటేరు మొగ)

ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.353.1 కోట్లు

ఏటా 28,700 టన్నుల మత్స్య సంపద లావాదేవీలు

ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల మందికి ఉపాధి

900 బోట్లు, ట్రాలర్ల నిలుపుదలకు అవకాశం 

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సర్వే

35 హెక్టార్లు కేటాయింపు

15 హెక్టార్లకు తగ్గించిన వైసీపీ ప్రభుత్వం

ప్రజాభిప్రాయ సేకరణ రేపు


విశాఖపట్నం/అచ్యుతాపురం, డిసెంబరు 29: జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి గురువారం ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. రూ.353.1 కోట్లతో నిర్మించనున్న ఈ హార్బర్‌ ద్వారా ఏటా 28,700 టన్నుల మత్స్య సంపద లావాదేవీలు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల మందికి ఉపాధి లభిస్తుందంటున్నారు.


అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో 99 శాతం మంది మత్స్యకారులే. సముద్రంలో చేపల వేటే వీరికి జీవనాధారం. ఇక్కడి నుంచి భారీస్థాయిలో చేపల ఎగుమతులు జరుగుతుంటాయి. కానీ మరపడవలు నిలుపుకోవడానికి సరైన ప్రదేశం లేకపోవడంతో నాటు పడవలు, మోటారు బోట్లతోనే వేట సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూడిమడకలో చేపల జెట్టీ (ఫిషింగ్‌ హార్బర్‌) ఏర్పాటుచేస్తే మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుందని,  ఆదాయం కూడా పెరుగుతుందని గత తెలుగుదేశం ప్రభుత్వం యోచించింది. 2016 జూలైలో అచ్యుతాపురం సెజ్‌కి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు....పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామని ప్రకటించారు. హార్బర్‌ ఏర్పాటుకు పూడిమడక వద్ద సముద్ర తీరం అనువుగా ఉందా?, ఎన్ని పడవలు ఉన్నాయి? సంవత్సరానికి ఇక్కడ నుంచి ఎంత విలువ చేసే మత్స్య సంపద ఎగుమతి అవుతున్నది? తదితర అంశాలపై అధ్యయనం చేసే బాధ్యతలు వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ (వాప్‌కాస్‌) సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ పలు సర్వేలు నిర్వహించి హార్బర్‌ నిర్మాణానికి పూడిమడక అనుకూలమేనని నివేదిక ఇచ్చింది. పూడిమడక వద్ద వున్న ఉప్పుటేరును వెడల్పుతోపాటు లోతు చేయాలని, దీనివల్ల చేపల వేట తర్వాత పడవలన్నీ ఉప్పుటేరు ద్వారా పూడిమడకకు చేరువలోకి వచ్చి, లంగరు వేసుకోవచ్చునని ప్రతిపాదించింది. అలాగే పల్లిపేట శివారున రుద్రభూమి నుంచి పొగిరి వరకు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు వేయాలని సూచించింది. హార్బర్‌ నిర్మాణానికి 35 హెక్టార్లు కావాల్సి వుంటుందని నివేదికలో పేర్కొంది. దీంతో పూడిమడక పంచాయతీ సర్వే నంబర్‌ 139లో 216 ఎకరాల భూమిలో 35 హెక్టార్లు కేటాయిస్తామని అప్పట్లో రెవెన్యూ అధికారులు అంగీకరించారు.  


టీడీపీ హయాంలోనే ప్రక్రియ పూర్తి... ప్రభుత్వం మారడంతో జాప్యం


మండలంలోని పూడిమడక వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించాలని గత ప్రభుత్వం యోచించి  సర్వే నిర్వహించింది. రూ.350 కోట్లు ఖర్చు అవుతాయని, 35 హెక్టార్ల భూమి అవసరమని సర్వే చేసిన వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ (వాప్‌కాస్‌) సంస్థ నివేదించింది. కొద్దిరోజుల్లో హార్బర్‌ నిర్మాణానికి శ్రీకారం చుడతారనగా...ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో మరుగున పడింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ...ఎట్టకేలకు ఏడాదిన్నర తరువాత ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే  హార్బర్‌ నిర్మాణానికి గతంలో ప్రతిపాదించిన 35 హెక్టార్లు కాకుండా 15 హెక్టార్లు మాత్రమే కేటాయించింది. ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటుపై ఈ నెల 31వ తేదీన పూడిమడకలో జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ సభ జరగనున్నది.

Updated Date - 2020-12-30T05:59:37+05:30 IST