మత్స్యరాశి..జీవకోటికి ఆధారం

ABN , First Publish Date - 2020-11-21T05:50:45+05:30 IST

ప్రపంచ మత్స్య దినోత్సవం శనివారం నిర్వహించడానికి మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మత్స్యరాశి..జీవకోటికి ఆధారం

జిల్లాలో 132 కి.మీ. తీర ప్రాంతం

విరివిగా లభ్యమవుతున్న మత్స్య సంపద

టైగర్‌ రొయ్య, వంజరం ఎక్కువగా లభ్యత

ఇతర ప్రాంతాలకు భారీగా ఎగుమతి

హార్బర్‌లో 800పైగా మర బోట్లు

నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం

విశాఖలో మత్స్య పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతున్నది. ఇక్కడి మత్స్యకారులు వేటాడిన చేపలు దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా టైగర్‌ రొయ్య, వంజరం వంటి మత్స్య సంపద ఇక్కడి ప్రత్యేకత. జిల్లాలో వేలాది మంది మత్స్యకారులు ఆధారపడే ఈ పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.

వన్‌టౌన్‌, నవంబరు 20 : ప్రపంచ మత్స్య దినోత్సవం శనివారం నిర్వహించడానికి మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా నవంబరు 21న ప్రపంచ మత్స్య దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. జిల్లాలో 132 కిలో మీటర్లు తీర ప్రాంతంలో 63 మత్స్యకార గ్రామాలు, 43 ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో 17 ఐస్‌ ప్లాంట్‌లు, 23 కోల్డ్‌స్టోరేజీలు, 15 ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లు, 36 రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.  విశాఖ పోర్టు ట్రస్ట్‌ ద్వారా ఇక్కడి మత్స్య ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం జరుగుతున్నది. 

ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణ 

 విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో 800పైగా మరబోట్లు ఉన్నాయి.  అయా బోట్లలో నిత్యం మత్స్యకారులు చేపల వేటకు వెళ్తుంటారు. వారం నుంచి మూడు రోజుల పాటు సముద్రంలో ఉండి  చేపల వేట సాగిస్తుంటారు. టైగర్‌ రొయ్య, వంజరం, కోనేం, గులివింద వంటి చేపలు మత్స్యకారులకు అధికంగా చిక్కుతుంటాయి. వీటితోపాటు ట్యూనా, కుంభకోణం వంటి చేపలు కూడా మత్స్యకారులకు లభిస్తుంటాయి. టైగర్‌ రొయ్య విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. కాగా,  ఫిషింగ్‌ హార్బర్‌ను 100 కోట్ల రూపాయలతో ఆధునికీకరించడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే రూ. 37 కోట్లతో ఆక్వా క్వారంటైన్‌ పనులు త్వరలో ప్రారంభం కానున్నట్టు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. 

మత్స్యకారుల సంక్షేమానికి పథకాలు

జిల్లాలో 20273 మంది మత్స్యకార కుటుంబాలకు  వేట నిషేధ కాలంలో ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకున్నది.  ప్రమాదవశాత్తు సముద్రంలో మరణించిన మత్స్యకార కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం, రూ. 5 లక్షలు ఇన్సూరెన్స్‌ అందిస్తున్నారు. అలాగే డీజిల్‌ సబ్సిడీ లీటరుకు రూ.9 చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది.  మత్స్య దినోత్సవం సందర్భంగా  మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఫిష్‌ కియోస్క్‌ ఈ-కార్డులు ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ప్రారంభించనున్నట్టు  ఫిషరీస్‌ అధికారులు తెలిపారు. కాగా, ఈ ఏడాది మత్స్య సంపద సంరక్షణ సుస్థిర చేపల పెంపకం, వేట విధానాలపై అవగాహన కల్పించినట్టు అధికారులు వివరించారు.


Read more