మండపాలపై పడ్డారు!

ABN , First Publish Date - 2020-12-18T05:14:10+05:30 IST

టీడీపీ నాయకులు, సానుభూతిపరులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందా?, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి యత్నిస్తోందా?, అందుకు అధికారులు సహకరిస్తున్నారా?...గురువారం సుజాతనగర్‌లో రెండు కల్యాణ మండపాలను జీవీఎంసీ అధికారులు సీజ్‌ చేసిన పద్ధతిని చూసిన వారెవరైనా అవుననే సమాధానం ఇస్తారు.

మండపాలపై పడ్డారు!
కల్యాణ మండపాన్ని సీజ్‌ చేస్తున్న ఆరో జోన్‌ ఏసీపీ మధుకుమార్‌, సిబ్బంది


టీడీపీ నాయకులు, వారి బంధువులకు చెందిన రెండు ఫంక్షన్‌ హాళ్లు సీజ్‌

పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జీవీఎంసీ అధికారులు, సిబ్బంది

భారీ పోలీస్‌ బందోబస్తుతో హడావిడి

పెళ్లిళ్లు ఉన్నాయని...రెండు రోజులు గడువు కోరినా నిరాకరణ

నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ తాళాలు

సుజాతనగర్‌లో ఉద్రిక్తత


పెందుర్తి/పెందుర్తి రూరల్‌, డిసెంబరు 17: టీడీపీ నాయకులు, సానుభూతిపరులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందా?, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి యత్నిస్తోందా?, అందుకు అధికారులు సహకరిస్తున్నారా?...గురువారం సుజాతనగర్‌లో రెండు కల్యాణ మండపాలను జీవీఎంసీ అధికారులు సీజ్‌ చేసిన పద్ధతిని చూసిన వారెవరైనా అవుననే సమాధానం ఇస్తారు. టీడీపీ 95వ వార్డు కార్పొరేటర్‌ అభ్యర్థి దాట్ల మధు, ఆయన బంధువుల కల్యాణ మండపాలను అధికారులు ఉన్నపళంగా సీజ్‌ చేయడం వివాదాస్పదమైంది. గురువారం ఉదయం 9.30 గంటలు...సుజాతనగర్‌ 80 అడుగుల రోడ్డు వద్దకు నగరంలోని వివిధ స్టేషన్ల నుంచి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఆ తరువాత పోలీస్‌ ఉన్నతాధికారులు, జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ వెంకటరమణ, టౌన్‌ ప్లానింగ్‌ ఆరో జోన్‌ ఏసీపీ మధుకుమార్‌, వీఆర్వోలు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది...ఇలా ఒక్కొక్కరుగా అక్కడకు వచ్చారు. ఎప్పుడూ లేనిది ఒక్కసారే అంతమంది రావడంతో ఏం జరిగిందో తెలియక స్థానికులు ఆందోళన చెందారు. అయితే కల్యాణ మండపాలను సీజ్‌ చేయడానికి ఇంత హడావిడి చేస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయారు. సుజాతనగర్‌ 80 అడుగుల రోడ్డులో టీడీపీ 95వ వార్డు కార్పొరేటర్‌ అభ్యర్థి దాట్ల మధుకు చెందిన దాట్ల మేన్షన్స్‌ ఫంక్షన్‌ హాల్‌, అతని బంధువులకు చెందిన దాట్ల కన్వెన్షన్స్‌ ఉన్నాయి. దాట్ల మేన్షన్స్‌ను ఆరేళ్ల క్రితం, దాట్ల కన్వెన్షన్‌ను నాలుగేళ్ల క్రితం నిర్మించారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అధికారులు ఉదయం 9.30 గంటలకు దాట్ల కన్వెన్షన్స్‌ను సీజ్‌ చేశారు. పెళ్లిళ్లు వున్నాయని రెండు రోజులు వెసులుబాటు ఇవ్వాలని వేడుకున్నా అధికారులు కనికరించలేదు. కల్యాణ మండపానికి తాళాలు వేసి అక్కడే నోటీసు తయారుచేసి అంటించారు. ఆ తర్వాత 11 గంటల సమయంలో దాట్ల కన్వెన్షన్స్‌కు ఎదురుగా గల దాట్ల మధుకు చెందిన దాట్ల మేన్షన్స్‌ ఫంక్షన్‌హాల్‌కు పోలీసులు, అధికారులు వెళ్లారు. వారిని మధు అడ్డుకున్నారు. సమాచారం తెలిసి టీడీపీ పెందుర్తి నియోజకవర్గం ఇన్‌చార్జి బండారు అప్పలనాయుడు హుటాహుటిన అక్కడకు వచ్చారు.   పెళ్లిళ్లు వున్నందున రెండు రోజులు సమయం ఇవ్వాలని కోరినా అధికారులు నిరాకరించారు. తమ చేతుల్లో ఏమీ లేదని, కమిషనర్‌ ఆదేశాలను అమలు చేస్తున్నామని టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ మధుకుమార్‌ చెప్పడంతో బండారు అప్పలనాయుడు...కమిషనర్‌ ఆర్డరా? లేక ఎమ్మెల్యే ఆర్డరా?...అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిని అధికారులు, పోలీసులు తోసుకుంటూ వెళ్లి కల్యాణ మండపానికి తాళాలు వేశారు. ఏసీపీ మధుకుమార్‌ విలేఖరులతో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందునే కల్యాణ మండపాలను సీజ్‌ చేశామని చెప్పారు. టీడీపీ పెందుర్తి ఇన్‌చార్జి బండారు అప్పలనాయుడు మాట్లాడుతూ టీడీపీ నాయకులు, సానుభూతిపరులను వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌ చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. 


కమిషనర్‌కు కళ్లు లేవా? : మాజీ ఎమ్మెల్యే బండారు ఆగ్రహం

‘జీవీఎంసీ కమిషనర్‌కు కళ్లు లేవా?..ఇదేనా ఐఏఎస్‌ చదువు..అధికార వైసీపీ నాయకుల రబ్బరుస్టాంప్‌గా మారుతున్నారు’ అని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజాతనగర్‌లో సీజ్‌ చేసిన కల్యాణ మండపాలను పరిశీలించిన ఆయన అధికారుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. నగరంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, అవి కమిషనర్‌కు కనిపించవా? అని ప్రశ్నించారు. పెందుర్తిలో అనుమతి లేని కల్యాణ మండపాలను చూపిస్తే సీజ్‌ చేయగలరా?...అని సవాల్‌ విసిరారు. అవి సక్రమంగా ఉన్నాయని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. విజయసాయిరెడ్డి చెప్పినట్టు వింటూ టీడీపీ నాయకులను టార్గెట్‌ చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

Updated Date - 2020-12-18T05:14:10+05:30 IST